నాలా పర్మిషన్ లేకున్నా రిజిస్ట్రేషన్లకు ఓకే.. 22ఏ పరిష్కారంలో మరో ముందడుగు

నాలా పర్మిషన్ లేకున్నా రిజిస్ట్రేషన్లకు ఓకే..  22ఏ పరిష్కారంలో మరో ముందడుగు
  • నివాస భూములకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
  • నాలా రుసుముతో పాటు ఫీజులు చెల్లిస్తే చాలు
  • మెమో 48062 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • జీవో అమలుపై నిరంతర నిఘా ఉంటుందన్న 
  • రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: నిషేధిత భూముల (22ఏ) సమస్యల పరిష్కారంలో మరో ముందడుగు పడింది. వ్యవసాయ భూములుగా ఉండి, ఆ తర్వాత నివాస ప్రాంతాలుగా మారినా నాలా అనుమతి ప్రక్రియ పూర్తికాక రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన నివాస పట్టా భూముల సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. ఈ మేరకు మెమో నంబర్ 48062 ద్వారా జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి శనివారం వెల్లడించారు.

క్షేత్రస్థాయి పరిస్థితులు, రెవెన్యూ రికార్డులు, యాజమాన్య హక్కులను సమగ్రంగా పరిశీలించిన తర్వాత, నిబంధనల ప్రకారం నాలా రుసుముతో పాటు ఇతర ప్రభుత్వ ఫీజులు వసూలు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా పారదర్శకంగా, నిర్దిష్ట కాలపరిమితిలో దరఖాస్తులను పరిష్కరించాలని, అమలు పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని స్పష్టం చేశారు. సొంత ప్లాట్లను అమ్ముకోలేక, అత్యవసరాలకు బ్యాంకు రుణాలు పొందలేక ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు తాజా నిర్ణయంతో ఊరట లభించనుంది.

24 గంటల్లోనే కమిటీ

గత నెల 16న శాసనసభలో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇచ్చిన హామీల అమలును ప్రభుత్వం రికార్డు సమయంలో వేగవంతం చేసిందని మంత్రి చెప్పారు. సీఎం హామీ ఇచ్చిన 24 గంటల్లోనే 22ఏ సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని నియమించామన్నారు. 


నిషేధిత భూముల జాబితాతో ముడిపడిన దాదాపు 10 నుంచి 12 రకాల సంక్లిష్ట సమస్యలను ఫాస్ట్‌‌ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా జీవో 118, జీవో 76 మార్గదర్శకాలకు అనుగుణంగా ఇప్పటికే మెమోలు జారీ చేశామని మంత్రి పొంగులేటి గుర్తుచేశారు. 22ఎ జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులు ఉన్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చామన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) దరఖాస్తుల పరిష్కారానికి కూడా ఉత్తర్వులు ఇచ్చామని, ఆ వరుసలోనే తాజాగా నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని తెలిపారు. భూ వివాదాలు లేని తెలంగాణను ఆవిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి వివరించారు.

అధికారులు పర్యవేక్షించాలి

రెవెన్యూ ఉన్నతాధికారులతో శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, 22ఏ సమస్యల పరిష్కారానికి జారీ చేసిన ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని తేల్చిచెప్పారు. నాలా రుసుము చెల్లింపులో ప్రజలకు ఎలాంటి గందరగోళం, జాప్యం లేకుండా అవసరమైన సహాయం అందించాలన్నారు. ఎక్కడా అవినీతికి, అలసత్వానికి తావులేకుండా అర్హత ఉన్న ప్రతి దరఖాస్తును త్వరగా పరిష్కరించాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.