జొన్న కొనుగోళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌

జొన్న కొనుగోళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌
  •     నోడల్‌ ఏజెన్సీగా మార్క్‌ఫెడ్‌ నియామకం
  •     రూ.327 కోట్ల ష్యూరిటీ ఇచ్చిన రాష్ట్ర సర్కారు

హైదరాబాద్‌, వెలుగు: జొన్న పంట కొనుగోళ్లకు సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మార్క్ ఫెడ్​ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. ఈ కొనుగోళ్లకు అవసరమైన రూ.327 కోట్ల సేకరణకు సర్కారు ఓకే చెప్పింది. ఈ నిధులను బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి లోన్ గా తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అగ్రికల్చర్‌ సెక్రటరీ రఘునందన్‌ రావు ఆదేశాలు జారీచేశారు. 

రాష్ట్రంలోని జొన్న రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు కొనుగోళ్లు జరపాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. అందుకు 46 కొనుగోలు కేంద్రాలు తెరవాలని మార్క్​ఫెడ్‌ నిర్ణయించింది. ఆదిలాబాద్‌ జిల్లాలో 9, గద్వాల్ లో 2, కామారెడ్డిలో 12, కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 2, మెదక్‌లో 3, నిర్మల్‌లో 5, సంగారెడ్డిలో 10, వికారాబాద్‌ జిల్లాలో 3 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. 

మార్కెట్లోని  వ్యాపారుల మాయజాలం 

రాష్ట్రంలో 2.07 లక్షల ఎకరాల్లో జొన్న సాగైంది. అధికారులు1.83 లక్షల ఎకరాల్లో ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.3,180గా నిర్ణయించారు. మార్కెట్లోని వ్యాపారులు  మాత్రం  రూ. 2,400కే కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం 91,865 టన్నులు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. మిగిలిన జొన్నలను  రైతులు ఎలా అమ్ముకోవాలనేది ప్రశ్నార్థకంగా మారింది.