లెక్చరర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

లెక్చరర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
  •  ఈనెల 16 నుంచి 31 వరకు ప్రక్రియ పూర్తిచేయాలె 
  • ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్  కాలేజీలకు గైడ్ లైన్స్ రిలీజ్ 

హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలోని హయ్యర్ ఎడ్యుకేషన్ లో లెక్చరర్ల బదిలీలకు సర్కారు గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది. ఒకేచోట ఐదేండ్లు పనిచేసిన వారంతా తప్పనిసరిగా బదిలీ కావాల్సిందేనని ఆదేశాలిచ్చింది. ఇంటర్మీడియెట్, డిగ్రీ, పాలిటెక్నిక్  కాలేజీల్లోని స్టాఫ్  బదిలీలకు సంబంధించిన గైడ్​లైన్స్ ను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం రిలీజ్  చేశారు. 

ఈనెల 16 నుంచి 31 వరకూ బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. ఒకే స్టేషన్​ లో జూన్ 30 వరకూ  ఐదేండ్ల సర్వీస్  పూర్తయిన వారంతా బదిలీ కావాల్సి ఉంటుందని, అదే సమయానికి రెండేండ్ల సర్వీస్  పూర్తయిన వారు బదిలీకి అర్హులని ఉత్తర్వుల్లో  పేర్కొన్నారు. 2026 జూన్ 30 వరకూ రిటైర్  అయ్యే లెక్చరర్లుంటే..వారికి బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. 

బదిలీల్లో స్పెషల్  కేటగిరిలో స్పౌజ్ ఎంప్లాయీకి 20 పాయింట్లు, 70 శాతం డిజబిలిటీ ఎంప్లాయీస్​ కు 15 పాయింట్లు, సింగిల్  ఉమెన్/విడోస్/ విడాకులు పొందిన మహిళకు 10 పాయింట్లు, న్యూరో సర్జరీ, క్యాన్సర్, కిడ్నీ/లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ, బోన్ టీబీతో బాధపడుతున్న ఎంప్లాయీస్​కు 20 పాయింట్లు, ఈ సమస్యలతో స్పౌజ్/పిల్లలు బాధపడుతుంటే పది పాయింట్లు పొందనున్నారు. బదిలీల షెడ్యూల్ రిలీజ్ పై లెక్చరర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఏండ్లుగాఒకేచోట కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేసి ఏడాదిన్నర క్రితం రెగ్యులర్  అయిన వారికి మాత్రం బదిలీల్లో అవకాశం ఇవ్వలేదు.