బెర్న్: గ్రీన్ ల్యాండ్‌ను అమెరికాకు అప్పగించి తీరాల్సిందేనని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. గ్రీన్ ల్యాండ్ భూభాగాన్ని డెన్మార్ కాపాడలేదని.. ఒక్క అమెరికా మాత్రమే గ్రీన్ ల్యాండ్‌ను రక్షించగలదని బీరాలు పలికారు. బుధవారం (జనవరి 21) వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ట్రంప్ పాల్గొన్నారు. ఆరు సంవత్సరాల తర్వాత దావోస్ సదస్సుకు హాజరైన ట్రంప్ ప్రపంచ ఆర్థిక వేదికను ఉద్దేశించి ప్రసంగించారు.
నా పాలనలో అమెరికా అభివృద్ధి పథంలో సాగుతోందని.. అమెరికన్లను కూడా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం కట్టడి చేశామని.. వృద్ధి రేటు గణనీయంగా ఉందని చెప్పారు. ప్రపంచ ఆర్థిక ఇంజిన్‌గా అమెరికా నిలుస్తోందన్నారు. అమెరికా అభివృద్ధే ప్రపంచ అభివృద్ధని.. అమెరికా డెలవప్ అయితే ప్రపంచం కూడా వృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. ఇక.. యూరోపియన్ యూనియన్ సరైన మార్గం వెళ్లట్లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.
యూరప్ ఇమ్మిగ్రేషన్ విధానం కూడా సరిగ్గా లేదని.. ఐరోపాలోకి పెద్ద ఎత్తున వచ్చే వలసలపై నియంత్రణ లేదన్నారు. యూరోపియన్ యూనియన్ ఆర్థిక వ్యవస్థ దివాళా తీస్తోందని.. ఈయూలో చాలా దేశాలు పతనం దిశగా వెళ్తున్నాయని వ్యాఖ్యానించారు. పరిపాలన ఎలా చేయాలో తనను చూసి నేర్చుకోవాలని యూరోపియన్ యూనియన్ దేశాలకు చురకలంటించారు. ఇక, వెనిజులాకు తెలివైన కొత్త నాయకత్వం వచ్చిందన్నారు. త్వరలోనే వెనిజులా ధనిక దేశంగా మారబోతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
