రణరంగంగా మారుతున్న గ్రీన్ లాండ్.. యూరప్ దేశాల నుంచి తరలివస్తున్న ఆర్మీ

రణరంగంగా మారుతున్న గ్రీన్ లాండ్.. యూరప్ దేశాల నుంచి తరలివస్తున్న ఆర్మీ

గ్రీన్‌లాండ్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అమెరికా పట్టుదల, డెన్మార్క్ అభ్యంతరం, ఐరోపా దేశాల మద్దతు కలిసి ఈ మంచు ఖండం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య యుద్ధానికి కేంద్రబిందువుగా మారింది. 

గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం మరోసారి తెరపైకి తెచ్చింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ ద్వీపం తమకు అత్యంత కీలకమని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అయితే డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనను మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గ్రీన్‌లాండ్ అమ్మకానికి లేదని వారు తెగేసి చెబుతున్నప్పటికీ.. అమెరికా మాత్రం 'టెక్నికల్ చర్చల' పేరుతో తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. ఈ పరిణామాలతో మంచు ప్రాంతంలో ఒక్కసారిగా హీట్ పెరిగిపోతోంది.

Also Read : ఉత్కంఠగా సాగుతోన్న మహారాష్ట్ర మున్నిపల్ ఎన్నికల కౌంటింగ్

ఈ ఉద్రిక్తతల మధ్య డెన్మార్క్‌కు మద్దతుగా ఐరోపా దేశాలు తమ బలగాలను గ్రీన్‌లాండ్‌కు పంపుతున్నాయి. మంచు పర్వత ప్రాంతాల్లో పోరాడగలిగే స్పెషల్ ఫోర్సెస్ ను ఇప్పటికే పంపింది ఫ్రాన్స్. మరోపక్క జర్మనీ. నిఘా కార్యకలాపాల కోసం 13 మంది సభ్యుల టీం ని అక్కడ దింపింది. అలాగే డెన్మార్క్ తన ఉనికిని చాటుకోవడానికి అక్కడ శాశ్వత సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజా పరిణామాలు నాటో మిత్రదేశాల మధ్య ఐక్యతను చాటడానికి, ఆర్కిటిక్ ప్రాంతంపై తమ పట్టును నిరూపించుకోవడానికి ఈ సైనిక విన్యాసాలు సంకేతంగా నిలుస్తున్నాయి.

ఐరోపా దేశాల సైనిక మోహరింపుపై రష్యా తీవ్రంగా స్పందించింది. ఇదంతా లేని ఘర్షణను క్రియేట్ చేసి ఆర్కిటిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచే చర్య అంటూ రష్యా విమర్శిస్తోంది. అమెరికా, ఐరోపా దేశాల తీరు చైనా, రష్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఉందని, ఆర్కిటిక్ శాంతియుత ప్రాంతంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు రష్యా పేర్కొంది.

మెుత్తానికి అమెరికా తన పంతం వీడకపోవడం, మరోవైపు ఐరోపా దేశాలు డెన్మార్క్ వెనుక నిలబడటంతో ఆర్కిటిక్ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. భద్రతా పరమైన అంశాలు చర్చల్లో ఉన్నప్పటికీ.. గ్రీన్‌లాండ్ సార్వభౌమాధికారం విషయంలో డెన్మార్క్ విధించిన 'రెడ్ లైన్స్' దాటడం అమెరికాకు సవాలుగా మారింది. భవిష్యత్తులో ఈ మంచు ద్వీపం ఎవరి నియంత్రణలో ఉంటుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. పెద్దపెద్ద దేశాలు గ్రీన్ లాండ్ చుట్టూ తమ రాజకీయ ప్రయోజనాలను చూసుకుంటూ అక్కడి వాతావరణాన్ని యుద్ధ భూమిలా మార్చుతున్నాయనేది ఒప్పుకోవాల్సిన నిజం అంటున్నారు నిపుణులు.