కలెక్టరేట్లలో గ్రీవెన్స్ డే..ధరణి సమస్యలే ఎక్కువ

కలెక్టరేట్లలో గ్రీవెన్స్ డే..ధరణి సమస్యలే ఎక్కువ

నిర్మల్, వెలుగు: జిల్లా కలెక్టరేట్లలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో ధరణి సమస్యలే ఎక్కువగా వస్తున్నాయి. ఎక్కువ మంది రైతులు తమ పేరుతో ఉన్న భూములు ధరణి లో ఎక్కలేదని పలువురు ఫిర్యాదులు అందిస్తున్నారు. సోమవారం నిర్మల్​జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ ముషారఫ్​ ఫారూఖీ గ్రీవెన్స్ సెల్ లో పలువురి నుంచి అప్లికేషన్స్ ​స్వీకరించారు. ధరణి సమస్యలు పరష్కరించాలని పలువురు రైతులు అప్లికేషన్స్​ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రీవెన్స్ సెల్​లో ఉన్నతాధికారులు ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. గ్రీవెన్ సెల్ లో 17 అప్లికేషన్స్​ స్వీకరించారు. అడిషనల్ కలెక్టర్లు హేమంత్ బోర్ఖడే, రాంబాబు పాల్గొన్నారు. 

ఆసిఫాబాద్, వెలుగు:  గ్రీవెన్స్​ లో అర్జీదారులు ఇచ్చిన ఫిర్యాదులపై ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్​లో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుంచి అప్లికేషన్స్​ స్వీకరించారు. 2018 నుంచి జిల్లాలో వివిధ ఆశ్రమ పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న వారికి మూడు నెలల వేతనంతోపాటు సీఆర్టీ పునరుద్ధరించాలని కోరుతూ అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం ఇచ్చారు. రెబ్బెన మండలం గౌతమినగర్​కు చెందిన చంద్రశేఖర్ గతంలో తనకు గతంలో ఉన్న పీహెచ్​సీ సర్టిఫికేట్​ను రద్దు చేశారని, తిరిగి మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు ఇచ్చారు.  పెంచికల్ పేట్ మండలం కొండపల్లికి చెందిన సప్పిడి ఈశ్వరి.. ఆమెకున్న పట్టా భూమిలో ఎవుసం చేసుకుంటుండగా ఫారెస్ట్​ఆఫీసర్లు అడ్డుకుంటున్నారని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. గ్రీవెన్స్​లో వచ్చిన దరఖాస్తుల పై ఆఫీసర్లు దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్​ఆదేశించారు.