నెంబర్ వన్ బ్రోకింగ్ కంపెనీ గ్రో

నెంబర్ వన్  బ్రోకింగ్ కంపెనీ గ్రో

న్యూఢిల్లీ: డిస్కౌంట్‌ బ్రోకింగ్ ఇండస్ట్రీలో మకుటంలేని మహారాజులా కొనసాగిన జెరోధాను  గ్రో అధిగమించింది. ఎన్‌‌ఎస్‌‌ఈ యాక్టివ్ క్లయింట్ల డేటా ప్రకారం, గ్రో యూజర్లు సెప్టెంబర్‌‌‌‌లో 66.3 లక్షలకు పెరిగారు. జెరోధా  యూజర్లు 64.2 లక్షలుగా ఉన్నారు.  ఈ ఏడాది ఆగస్టులో గ్రో  62 లక్షల యాక్టివ్‌‌ యూజర్ల మార్క్‌‌ను అందుకుంది. అప్పుడు జెరోధా యాక్టివ్ యూజర్లు 63 లక్షలుగా రికార్డయ్యారు. డిస్కౌంట్ బ్రోకింగ్‌‌లో  పేటీఎం మనీ, అప్‌‌స్టాక్స్‌‌, బ్లింక్స్‌‌, ధన్‌‌, హెచ్‌‌డీఎఫ్‌‌సీ స్కై వంటి కంపెనీలు విస్తరిస్తున్నా, గ్రో మాత్రం అతి పెద్ద స్టాక్ బ్రోకింగ్‌‌ కంపెనీగా ఎదిగింది. 

ఇప్పటి వరకు నెంబర్ వన్ పొజిషన్‌‌లో కొనసాగిన జెరోధా 2022–23 లో రూ.6,875 కోట్ల రెవెన్యూపై రూ.2,900 కోట్ల  నికర లాభం ప్రకటించింది. రెవెన్యూ, ప్రాఫిట్ పరంగా ఈ కంపెనీ ఇంకా టాప్‌‌లో కొనసాగుతోంది. మరోవైపు  నష్టాల్లో నడుస్తున్న ఇతర స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు భారీ వాల్యుయేషన్ దగ్గర ఫండ్స్ సేకరిస్తున్నాయి. జెరోధా మాత్రం ఇప్పటి వరకు బయట  నుంచి ఫండ్స్‌‌ సేకరించలేదు. గ్రో, జెరోధా రెండూ కూడా ఈ ఏడాది మ్యూచువల్ ఫండ్స్ సెగ్మెంట్‌‌లోకి ఎంటర్ అయ్యాయి. జెరోధా  స్మాల్‌‌కేస్‌‌తో కలిసి ఈ బిజినెస్‌‌లోకి ప్రవేశించింది. ఇండియాబుల్స్ ఏయూఎంను గ్రో కొనుగోలు చేసింది. గ్రోను ఫ్లిప్‌‌కార్ట్ మాజీ ఉద్యోగులు లలిత్‌‌ కేశ్రే, హర్ష్‌‌ జైన్‌‌, నీరజ్‌‌ సింగ్‌‌, ఇషాన్‌‌ బన్సాల్‌‌లు 2016 లో ఏర్పాటు చేశారు.