అక్కతోపాటు చెల్లిని పెళ్లాడిన వరుడి అరెస్ట్

 అక్కతోపాటు చెల్లిని పెళ్లాడిన వరుడి అరెస్ట్
  • పెళ్లికూతురు పట్టుపట్టడం వల్లే ఆమె చెల్లికి కూడా తాళికట్టానన్న పెళ్లికొడుకు
  • వధూవరుల తల్లిదండ్రులతోపాటు పెండ్లి పత్రిక ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్, పెళ్లి జరిపించిన పూజారిపై కూడా కేసు

బెంగళూరు: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న సామెత అక్షరాల నిజమైంది. పెళ్లికూతురు పట్టుపట్టడంతో అక్కతోపాటు చెల్లి మెడలోనూ తాళి కట్టిన వరుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు వధూ వరుల ఇరువైపులా తల్లిదండ్రులే కాదు పెండ్లి పత్రిక ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ యజమాని, పెళ్లి జరిపించిన పూజారిపై కూడా కేసు నమోదు చేయడం సంచలనం సృష్టించింది. కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాలోని వేగమడుగు గ్రామంలో ఈనెల 7వ తేదీన అక్కా చెల్లెలిని ఉమాపతి (29) అనే యువకుడు పెళ్లాడిన విషయం తెలిసిందే. తనతోపాటు పుట్టు మూగ, చెవిటి అయిన తన చెల్లికి కూడా తాళి కట్టాల్సిందేనని పెళ్లి కుమార్తె సుప్రియ(21) పట్టుపట్టడం వల్లే ఇద్దరికీ తాళి కట్టానని పెళ్లికొడుకు ఉమాపతి చెప్పిన సమాధనంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. 
పెళ్లి నిర్ణయం తీసుకున్నప్పుడే పెళ్లి కూతురు ఈ ప్రతిపాదన చేసిందని.. మూగ, చెవిటి అయిన తన చెల్లిని ఎవరూ పెళ్లి చేసుకోరని, నువ్వే ఆమెను కూడా పెళ్లి చేసుకోవాలని సుప్రియ చేసిన డిమాండ్ కు  అంగీకరించి నిర్ణయించిన ముహుర్తానికే ఇద్ద‌రు అక్కాచెల్లెళ్ల‌కు తాళి కట్టానని చెప్పాడు. పెండ్లి ఫోటోలు కొన్ని తమ బంధువులు ఇతరులకు షేర్ చేయడంతో అవి కాస్తా వైర‌ల్ అయి పోలీసుల దాకా చేరింది. పెళ్లికూతురు సుప్రియ సోద‌రి వ‌య‌సు 16 ఏండ్లేనని తెలియడంతో పోలీసులు స్పందించి పెళ్లి చేసుకున్న యువ‌కుడితో పాటు అత‌ని కుటుంబ స‌భ్యుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.
 కోలార్ జిల్లాలోని ముళబాగిలు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయడంతో  స్త్రీ శిశు సంక్షేమ శాఖ, పిల్లల రక్షణ కేంద్రం అధికారులు తహశీల్దార్‌ తో కలసి  సోమవారం గ్రామానికి వెళ్లి విచారించారు. ఒక పెళ్లికూతురు వయసు 16 ఏళ్లేనని తెలియడంతో పెళ్లికొడుకు ఉమాపతి, అతని తల్లిదండ్రులు దొడ్డలక్ష్మమ్మ, చిక్క చిన్నరాయప్ప, వధువు తల్లిదండ్రులు రాణెమ్మ, నాగరాజప్పలపై కేసు నమోదు చేశారు. తొలుత పెండ్లి కొడుకును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అంతేకాదు పెండ్లిపత్రికను ముద్రించి బంధువులందరికీ పంచి మరీ పెళ్లి చేసుకున్నారని తెలసి పెండ్లి పత్రిక ముద్రించిన గాయత్రి ప్రింటర్స్‌ యజమాని, పెళ్లి జరిపించిన పూజారి  పైన సిడిపిఓ ఎం.రమేష్‌ నంగలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.