పెండ్లి బరాత్​ కోసం వచ్చి బుక్కయిపోయిన్రు

పెండ్లి బరాత్​ కోసం వచ్చి బుక్కయిపోయిన్రు

అలీగఢ్(ఉత్తరప్రదేశ్): ‘‘నీ పెండ్లి జీవితంలో మరిచిపోలేం” ఈ డైలాగ్​ను మనం సినిమాల్లోనే కాదు.. చాలా సార్లు నిజజీవితంలోనూ వింటూనే ఉంటాం. ఉత్తరప్రదేశ్​లోని విధిపూర్​ గ్రామస్తులు ఇప్పుడు ఇదే మాట అంటున్నారు. ఆ గ్రామానికి చెందిన సావిత్రికి గత నెలలోనే పెండ్లయ్యింది. మార్చి 21న తన అత్తారింటికి వెళ్లేందుకు 12 మంది బరాత్​ బృందం వచ్చింది. వీరంతా మార్చి 23న జార్ఖండ్​లోని ధన్​బాద్​ జిల్లాకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆ రోజు నుంచి దేశ వ్యాప్తంగా లాక్​డౌన్​ అమలులోకి వచ్చింది. దీంతో పెండ్లి కొడుకు, పెండ్లి కూతురుతో పాటు బరాత్​ కోసం వచ్చిన అందరూ విధిపూర్​ గ్రామంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పటికి వారంతా వచ్చి మూడు వారాలు గడిచింది. వారంతా వెళ్లడానికి లేదు. దీంతో బరాత్​ కోసం వచ్చిన కొంత మంది సహనం కోల్పోతున్నారు. కానీ ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. తన పరిస్థితి ఏమిటో తెలియక సావిత్రి పూర్తిగా గందరగోళంలో పడిపోయింది. సావిత్రి ఫ్యామిలీనే బరాత్​ కోసం వచ్చిన వారందరికీ అన్ని సదుపాయాలు కల్పిస్తోంది. వారి పరిస్థితి తెలుసుకున్న జిల్లా అధికారులు ఒక పూట భోజనం అందిస్తున్నారు. బరాత్​ కోసం వచ్చిన వారందరికీ కరోనా టెస్టులు చేయగా.. అందరికీ నెగెటివ్​ వచ్చింది. మార్చి 20న తమ ఊరి నుంచి వచ్చేటప్పుడు అసలు ఇన్ని రోజులు ఉండాల్సి వస్తుందని తాము ఊహించలేదని బరాత్​ కోసం వచ్చిన వారు చెప్పారు. లాక్​డౌన్​ను ఇంకా పొడిగించే అవకాశాలు కనిపిస్తుండటంతో వీరంతా ఎప్పుడు ధన్​బాద్​ వెళతారనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. దీంతో ఈ పెండ్లి గురించి విధిపూర్​ గ్రామస్తులు మాట్లాడుతూ.. తమ జీవితంలో ఈ పెండ్లిని మాత్రం మరిచిపోలేం అని చెబుతున్నారు.