కరెంట్ ​షాక్​తో పెండ్లి కొడుకు మృతి.. సిద్దిపేట జిల్లా కేంద్రంలో విషాదం

కరెంట్ ​షాక్​తో పెండ్లి కొడుకు మృతి.. సిద్దిపేట జిల్లా కేంద్రంలో విషాదం
  • మంచిర్యాలలో దండెంపై టవల్​ ఆరేస్తూ తండ్రి..కాపాడబోయిన కొడుకు కన్నుమూత 
  • మెదక్​ జిల్లాలో పొలానికి వెళ్లిన రైతుకు వైరు తగిలి దుర్మరణం  

సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట జిల్లా కేంద్రంలో రిసెప్షన్​రోజు ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా కరెంట్​షాక్​తో ఓ వరుడు కన్నుమూశాడు. పోలీసుల కథనం ప్రకారం...సిద్దిపేట రూరల్ మండలంలోని వెంకటాపూర్ కు చెందిన నారోజు నిరంజన్ (38) సిద్దిపేటలోని ఇందిరానగర్ స్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తూ, స్థానిక నాసర్ పురాలో ఉంటున్నాడు.  ఈనెల 2న బోధన్ కు చెందిన యువతితో నిరంజన్ పెండ్లయ్యింది. సోమవారం సిద్దిపేటలోని ఓ ఫంక్షన్ హాల్ లో రిసెప్షన్ పెట్టుకున్నారు. డిన్నర్​కు సంబంధించిన ఏర్పాట్ల విషయమై నిరంజన్ తెల్లవారుజామున బంధువులతో ఫోన్ మాట్లాడుతూ డాబాపైకి వెళ్లాడు.

ముసురు పడుతుండగా ఫోన్ మాట్లాడుతూ పారాపిట్ వాల్ రెయిలింగ్​ను పట్టుకున్నాడు. పెండ్లి డెకరేషన్​లో భాగంగా ఏర్పాటు చేసిన సీరిస్ బల్బ్​వైరింగ్ తెగి రెయిలింగ్ కు ఉన్న ఇనుప రాడ్ కు కరెంట్​సరఫరా కావడంతో షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. ఉదయం చాలా సేపైనా పెండ్లి కొడుకు కనిపించకపోవడంతో కుటుంబీకులు ఆయన కోసం చాలా సేపు వెతికారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో వెతకడం మొదలుపెట్టారు. డాబా పైకి వెళ్లి చూడగా కిందపడి చనిపోయి ఉన్నాడు. నిరంజన్ కు నలుగురు అక్కాచెల్లెళ్లు ఉండగా...తల్లి, తండ్రి రెండు వైపులా నిరంజన్ ఒక్కడే మగ సంతానం. 

మంచిర్యాలలో తండ్రీ కొడుకులు...

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం కరెంట్​షాక్​తో తండ్రీ కొడుకులు చనిపోయారు. ఎంసీసీ క్వార్టర్లలో ఉంటున్న ఎడ్ల రాజేందర్(50) ఓ ప్రైవేట్​కంపెనీలో సెక్యూరిటీ గార్డు. ఈయన కొడుకు అరుణ్​కుమార్(17) బైక్​ మెకానిక్. సోమవారం మధ్యాహ్నం రాజేందర్ స్నానం చేసి టవల్ ను ఇంట్లోని ఇనుప దండెంపై ఆరెయ్యబోయాడు. కూలర్ ఆన్​లో ఉండి ఇనుప దండేనికి తాకి ఉండడంతో షాక్​కొట్టి కింద పడ్డాడు. ఇది చూసిన అరుణ్​కుమార్ వెంటనే వచ్చి తండ్రి చేతిలో ఉన్న వైరును తీసేసి రక్షించబోయాడు. ఈ క్రమంలో అతడూ షాక్​కు గురయ్యాడు. గమనించిన రాజేందర్​భార్య సరోజ.. భర్త, కొడుకును కాపాడబోయినప్పటికీ షాక్​రావడంతో వెనక్కి తగ్గింది. దీంతో ఆమెకు ప్రాణాపాయం తప్పగా.. తండ్రీ కొడుకులిద్దరూ ప్రాణాలు విడిచారు. డెడ్​బాడీలను పోస్టుమార్టం కోసం గవర్నమెంట్​జనరల్ హాస్పిటల్​కు తరలించారు.  

పొలం వద్ద రైతు 

కొల్చారం: మెదక్​జిల్లా కొల్చారం మండలంలోని సీతారాం తండాలో సోమవారం కరెంట్ షాక్ తగిలి ఓ రైతు చనిపోయాడు. వరిగుంతం పంచాయతీ పరిధిలోని సీతారాం తండాకు చెందిన బానావత్ గోవర్ధన్ (64) ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి పొలానికి వెళ్లాడు. కొద్దిసేపటికే పొలంలోని బోర్ వద్ద ఉన్న కరెంట్ వైరుకు తగలడంతో షాక్  కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో విషయం ఎవరికీ తెలియలేదు. సాయంత్రమైనా గోవర్ధన్​ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూడగా అక్కడ విగతజీవిగా పడి ఉన్నాడు. గమనించి చూడగా చనిపోయి ఉన్నాడు. మృతుడికి  భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొల్చారం ఎస్సై మహమ్మద్ గౌస్ పాషా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.