మహబూబ్ నగర్ లో వేరుశనగ క్వింటాల్ ధర రూ.10 వేల 280

 మహబూబ్ నగర్ లో  వేరుశనగ  క్వింటాల్ ధర  రూ.10 వేల 280
  • హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

వనపర్తి/జడ్చర్ల/కల్వకుర్తి, వెలుగు:ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లలో అమ్మకానికి వచ్చిన వేరుశనగకు వ్యాపారులు ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల వ్యవసాయ మార్కెట్​లో వేరుశనగ ధర  మరోసారి రికార్డులకెక్కింది. గురువారం క్వింటాల్​కు రూ.9,865 ఉండగా, శుక్రవారం రూ.10,280 పలికింది. నిన్నటితో పోల్చితే ఈ రోజు క్వింటాల్​కు రూ. 415 పెరిగింది. గరిష్ట ధర రూ.10280 కాగా, కనిష్ట ధర రూ.7560 ఉంది. సరాసరి క్వింటాల్​ ధర రూ.9,369 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. కల్వకుర్తి మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటాల్  వేరుశనగ ధర రూ.10, 200 పలికింది. వనపర్తి మార్కెట్​లోనూ రూ.10 వేలు దాటడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నెల తిరక్కుండానే..

నెల రోజుల వ్యవధిలోనే క్వింటాల్​కు రూ. వెయ్యి నుంచి రూ.1,200 వరకు వేరుశనగ ధర పెరిగింది. వనపర్తి వ్యవసాయ మార్కెట్​ యార్డు ప్రారంభమై 47 ఏండ్లవుతున్నా, ఈ స్థాయిలో ఎన్నడూ ధర పెరగలేదని రైతులు, మార్కెట్​ అధికారులు చెబుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో ఉమ్మడి జిల్లాలో గత కొన్నేళ్లుగా వేరుశనగ సాగు తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తి, గద్వాల, నాగర్​కర్నూల్​ మార్కెట్లకే వేరుశనగ వస్తోంది. అందులోనూ వనపర్తి మార్కెట్​కే ఎక్కువగా వస్తోంది. 

వనపర్తి పల్లీకి డిమాండ్..

వనపర్తి జిల్లాలోని నేల స్వభావాన్ని బట్టి ఇక్కడ పండించే వేరుశనగలో అఫ్లాటాక్సిన్​ శిలీంద్రం లేకపోవడంతో ఎగుమతికి అనువైన రకంగా వ్యాపారులు భావిస్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్​ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. దీంతో ఇక్కడి వేరుశనగకు విపరీతమైన డిమాండ్​ ఏర్పడింది. ఈ సారి ఖరీఫ్​లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పల్లీ పంటకు తెగులు సోకి దిగుబడి 20 శాతం తగ్గింది. 20వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేయగా, దిగుబడి 10 క్వింటాళ్ల నుంచి 7 క్వింటాళ్లకు తగ్గడంతో రైతులు ఆందోళన చెందారు. మార్కెట్​లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే ఎక్కువ ధర పలుకుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

యాసంగిలో పెరిగిన సాగు..

గత మూడేండ్లుగా వనపర్తి జిల్లాలో వేరుశనగ సాగు తగ్గుముఖం పడుతూ వస్తోంది. 2022–-23లో 22 వేల ఎకరాలు సాగవగా, నిరుడు 15 వేల ఎకరాలకు పడిపోయింది. ఈక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జాతీయ నూనె గింజల ఉత్పత్తి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద జిల్లాలో  పాన్​గల్, పెద్దమందడి, పెబ్బేరు మండలాలను ఎంపిక చేసి రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఇక్రిశాట్​ శాస్త్రవేత్తలు డెవలప్​ చేసిన కదిరి, లేపాక్షి, జీజేసీ-32, గిర్నాల్​ రకం వేరుశనగ విత్తనాలను జాతీయ నూనె గింజల ఉత్పత్తి పథకం కింద పంపిణీ చేశారు.  దీంతో ఈ ఏడాది యాసంగిలో 25వేల ఎకరాల్లో పంట సాగు కానుంది. ఇది నిరుటి కంటే యాభై శాతం ఎక్కువగా చెప్పుకోవచ్చు. 

గతంలో ఎన్నడూ ఈ రేట్​ రాలే..

ఆరు ఎకరాల్లో పల్లి వేశాను. 70 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాల్ కు రూ.10,200 ధర పలికింది. గతంలో ఇంత రేటు ఎన్నడూ ఇవ్వలేదు. కాయితి జైపాల్ రెడ్డి, వెంకటాపూర్, కల్వకుర్తి మండలం

రైతులకు అండగా ఉంటాం..

అన్ని పంటలకు మంచి ధర అందేలా చూస్తాను. మార్కెట్​కు వచ్చిన వేరుశనగ పంటకు రూ.10 వేలకు పైగా ధర పలకడం ఆనందంగా ఉంది. నాణ్యమైన పంటకు మంచి ధర ఇప్పించేందుకు కృషి చేస్తా. మనీలా సంజీవ్  యాదవ్, ఏఎంసీ చైర్మన్, కల్వకుర్తి