- ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు..
- అడుగంటుతున్న బోరుబావులు
- పంటలను కాపాడుకునే ప్రయత్నంలో రైతులు
- బోర్లను అద్దెకు తీసుకుంటున్నా తప్పని తిప్పలు
మహబూబ్‌నగర్, వెలుగు : ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాసంగి పంటలు దెబ్బతింటున్నాయి. ప్రధానంగా వరి పంటలు ముదురుతున్న ఎండలతో వాడిపోతున్నాయి. చివరి దశల్లో ఉన్న పంటలకు ఆఖరి తడులకు సాగునీరు అందక ఎండిపోయతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈసారి రికార్డు స్థాయిలో సాగు..
ఈ ఏడాది భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద రావడంతో మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని చెరువులు, కుంటలు ఫుల్ కెపాసిటీకి చేరుకున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 5.29 మీటర్ల లెవల్ ఎత్తుకు, నారాయణపేట జిల్లాలో 4.23 మీటర్ల లెవల్ ఎత్తుకు భూగర్భ జలాలు పెరిగాయి. అయితే ఈ రెండు జిల్లాల్లో సాగునీటి కాలువలు, ప్రాజెక్టులు అంతగా లేకపోవడంతో ఏండ్లుగా యాసంగిలో బోర్ల కిందనే రైతులు వరి సాగుకుచేపడుతున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా యాసంగిలో రైతులు బోర్ల కిందనే వరిని వేశారు.
అయితే ఈసారి భూగర్భ జలాలు పెరిగాయని సాగును డబుల్ చేశారు. ఏటా ఈ సీజన్లో రెండు జిల్లాలో యావరేజ్‌గా 1.90 లక్షల ఎకరాల్లోపే పంటలు సాగయ్యేవి. కానీ ఈ సీజన్లో రికార్డు స్థాయిలో రెండు జిల్లాల్లో దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. అందులో మమబూబ్‌నగర్ 1.90 లక్షల ఎకరాల్లో, నారాయణపేటలో 1.85 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ప్రస్తుతం వరి చేన్లు కొన్ని చోట్ల కోత దశకు చేరుకోగా, మరికొన్ని చోట్ల కంకి పట్టి పాల దశకు చేరుకున్నాయి. ఈ చేన్లను ఒక తడి నీరు అందిస్తే ఈ నెలాఖరులోపు కోతలు చేసుకోవచ్చు. కానీ, రెండు వారాలుగా సాగునీరు అందక చేన్లు ఎండిపోతున్నాయి. సాగునీరు అందక ఇప్పటి వరకు ప్రతీ మండలంలో దాదాపు పది శాతం నుంచి 20 శాతం వరకు వరి చేన్లు ఎండిపోయాయని ఆఫీసర్లు చెబుతున్నారు.
వేగంగా పడిపోతున్న గ్రౌండ్ వాటర్
ఈ ఏడాది గ్రౌండ్ వాటర్ లెవల్స్ ఎంత వేగంగా పెరిగాయో అంతే వేగంగా పడిపోతున్నాయి. మార్చి చివరి వారం నుంచే ఎండలు ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచే పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 42 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో గ్రౌండ్ వాటర్ లెవల్స్ పడిపోయాయి. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాలోని వేపూరులో 19.1 మీటర్ల లోతుకు, పోమాల్‌లో 18.1, శేరివెంకటాపూర్ 17, సల్కార్‌పేట 16.2, కురుమూర్తి 15.86, వెన్నాచెడ్ 15.5, లోకిరేవు 15.7, హన్వాడ 14.83, కోయిల్‌కొండ 14.11, మిడ్జిల్ 13.32, ఉడిత్యాల్ 12.96, చిన్నరాజమూరు 12.6 మీటర్ల లోతుకు గ్రౌండ్ వాటర్ పడిపోయింది.
నారాయణపేట జిల్లాలోని కొండాపూర్‌లో 17.92, ధన్వాడలో 17.55, మద్దూరులో 11.50, కొత్తపల్లిలో 10.80, మరికల్లో 9.02 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఇక మక్తల్, నర్వ, ఊట్కూరు మండలాల్లోనే గ్రౌండ్ వాటర్ క్రమంగా పడిపోతోంది. ఎండలు ఇలాగే కొనసాగితే.. రానున్న వారం రోజుల్లో గ్రౌండ్ వాటర్ లెవల్స్ 20 మీటర్ల లోతుకు పడిపోయే అవకాశాలు ఉన్నాయి.

