- గతేడాదితో పోలిస్తే 30 శాతం
- తగ్గిన భూగర్భ జలాలు
- కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 32.04 మీటర్ల లోతులో నీళ్లు
- 20% ప్రాంతాల్లోనే 10 మీటర్లలోపు
- భూమిలోకి ఇంకడం తక్కువ.. వినియోగం ఎక్కువ
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో విలీన ప్రాంతాలతో పాటు గ్రేటర్ పరిధిలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. నగరంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి 30 శాతం నీటి నిల్వలు తగ్గినట్టు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలాఖరు నాటికి భూగర్భ జలాలు ఆందోళనకరంగా ఉన్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా వెస్ట్ సిటీతో పాటు ఉప్పల్, పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో భూగర్భ జలాలు అనూహ్యంగా తగ్గుముఖం పట్టినట్టు అధికారులు చెబుతున్నారు.
ఆయా ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు ఎక్కువగా జరుగుతుండడం, చాలా ఇండ్లకు ఇంకుడు గుంతలు లేక పోవడం, కాలనీలు, బస్తీల్లోనూ కాంక్రీట్ రోడ్లు వేయడం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేకుండా పోయిందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గినట్టు చెబుతున్నారు. దీంతో చాలా మంది మెట్రోవాటర్‌బోర్డు సరఫరా చేసే ట్యాంకర్లపై ఆధార పడుతున్నారు. రోజుకు 12వేల ట్యాంకర్ల వరకూ బుకింగ్ అవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఎక్కడెక్కడ భూగర్భ జలాలు తగ్గాయంటే
గ్రేటర్ పరిధిలో పెరుగుతున్న నీటి ఎద్దడికి ప్రధాన కారణం అధిక వినియోగమేనని అధికారులు చెబుతున్నారు. అయితే భూమిలో ఇంకే నీటి కంటే వినియోగం అధికం కావడం ప్రధాన కారణమంటున్నారు. నగరంలోని 20 శాతం ప్రాంతాల్లోనే 10 మీటర్లలోపు నీటి మట్టం వుందని అధికారులు చెబుతున్నారు. 80 శాతం ప్రాంతాల్లో భూగర్భ జలాల సమస్య తీవ్రంగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా బాచుపల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మాసాబ్ టాంక్, కాప్రా, కూకట్ పల్లి, సైదాబాద్ తదితర ప్రాంతాల్లో గతేడాది కంటే 30శాతం నీటి నిల్వలు తగ్గినట్టు చెబుతున్నారు.
ముఖ్యంగా కుత్బుల్లాపూర్ లో అత్యధికంగా 32.04 మీటర్ల లోతుకు పడిపోయినట్టు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నారు. అలాగే కూకట్పల్లిలో 27.11 మీటర్లు, చెంగిచెర్లలో 21.72 మీ., మేడిపల్లి 19.63, మీటర్లు, ఎస్ ఆర్ నగర్ లో 19.44 మీటర్లు, మల్కాజ్ గిరిలో 18.45 మీటర్లు, మారేడ్‌పల్లిలో 17.05 మీటర్ల దిగువకు పడిపోయినట్టు అధికారులు తెలిపారు. ప్రధానంగా కుత్బుల్లాపూర్, చాంద్రాయణగుట్ట, మారేడ్‌పల్లి, ముషీరాబాద్, గుండ్లపోచంపల్లి, జీడిమెట్ల, పటాన్చెరు, ఆర్సీ పురం వంటి ప్రాంతాల్లో నెలరోజుల్లోనే దాదాపు 2 మీటర్ల లోతుకు నీరు తగ్గిందని అధికారులు పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, చెంగిచెర్ల, ఎస్ఆర్ నగర్, మల్కాజ్ గిరి, ఉప్పల్, ఎర్రగడ్డ వంటి ప్రాంతాల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయని అధికారులు వెల్లడించారు.
మేల్కొనక పోతే నీటి కష్టాలు తప్పవు
గ్రేటర్ పరిధిలో భూగర్భ జలాలు ఆందోళనకరంగా పడిపోతున్నాయని చెబుతున్న అధికారులు ప్రజలు మేల్కొనక పోతే రాబోయే కాలంలో నగరంలో తీవ్ర నీటి ఎద్దడి తప్పదని హెచ్చరిస్తున్నారు. మెట్రోవాటర్‌బోర్డు సరఫరా చేస్తున్న నీటిని తాగునీటి అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తుండడం వల్ల సమస్యలు పెరుగుతున్నాయి. గ్రేటర్ పరిధిలో వచ్చే వర్షాకాలం నాటికి కనీసం 30వేల ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టాలని వాటర్‌బోర్డు ప్రయత్నిస్తున్నది.
ఈ మేరకు ఇప్పటికే ఓఆర్ఆర్ విలీన ప్రాంతాల్లో ఇంకుడు గుంత ఉంటేనే కొత్త వాటర్ కనెక్షన్లు ఇస్తామన్న నిబంధన పెట్టింది. వెస్ట్ సిటీ, కోర్సిటీలలో కూడా ప్రతి 250 గజాల స్థలంలో నిర్మించిన ఇంటికి తప్పని సరిగా ఇంకుడు గుంత నిర్మించుకోవాలన్న నిబంధన పెట్టింది. ఇప్పటికే దాదాపు 10వేల ఇండ్లలో ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తిచేసినట్టు అధికారులు చెబుతున్నారు. నగరంలోని ప్రతి ఒక్కరూ వర్షపు నీరు భూమిలోకి వెళ్లే విధంగా ఇంకుడు గుంత నిర్మించుకుంటే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
