షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష : టీఎస్పీఎస్సీ

షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష : టీఎస్పీఎస్సీ

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-1 మెయిన్‌ పరీక్ష సహా.. మిగిలిన రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ షెడ్యూల్ ప్రకారం నిర్వహించబడతాయని తెలిపింది. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన  విలేకరుల సమావేశంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బీ. జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. పరీక్షలు యధావిదిగానే జరుగుతాయని తెలిపారు.

గ్రూప్-1, ఏఈ పరీక్షా పత్రాలు లీక్ కావడంతో.. మిగతా పేపర్లు కూడా లీక్ అయ్యాయని, వాటిని రద్దు చేసి మళ్లీ రీ షెడ్యూల్ చేయాలని సభ్యులు ఆందోళనలు జరుపుతున్నారు. అలాంటివేవీ లేవని.. టీఎస్పీఎస్సీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్, అవకతవకలు జరిగే అవకాశం లేదని జానార్దన్ రెడ్డి తేల్చి చెప్పారు. నిందితుల దగ్గరనుంచి అన్ని సాక్షాధారాలు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని, అందుకే షెడ్యూల్ ప్రకారమే మిగతా రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. 

ప్రశ్నాపత్రాల లీక్‌లో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో 103 మార్కులు సాధించిన విషయంపై మాట్లాడిన జనార్దన్ రెడ్డి.. ప్రవీణ్ కు 103 మార్కులు వచ్చిన మాట వాస్తవమేనని, అయితే.. అతను గ్రూప్-1 మెయిన్ పరీక్షకు అర్హత సాధించలేదని తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో 103 మార్కులు టాప్ మార్కులు కాదని కూడా ఆయన స్పష్టం చేశారు.