
- ఆరోజు టీఎస్ పీఎస్సీ మీటింగ్.. అప్పుడే ప్రకటించే అవకాశం
- దరఖాస్తు చేసుకోవడానికి నెల రోజుల గడువు
- పది నెలల్లోనే పూర్తి చేసేలా ప్లాన్
హైదరాబాద్, వెలుగు: కోర్టు కేసులు, ఇతర చిక్కులు లేకుంటే పది నెలల్లోనే గ్రూప్1 పోస్టుల భర్తీని పూర్తి చేసేలా టీఎస్పీఎస్సీ అధికారులు ప్లాన్ రెడీ చేశారు. ఇంటర్వ్యూలను ఎత్తేయడంతో వీలైనంత త్వరగా రిజల్ట్ ఇవ్వాలని యోచిస్తున్నారు. ఈ వారంలోనే గ్రూప్1 నోటిఫికేషన్ ఇచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 22న టీఎస్పీఎస్సీ పూర్తిస్థాయి సమావేశం నిర్వహిస్తుండటంతో అందులో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశముంది. అదేరోజు నోటిఫికేషన్ ఇచ్చే చాన్స్ కూడా ఉంది. గ్రూప్ 1 అప్లికేషన్లకు నెలరోజుల పాటు గడువు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
ఇప్పటికే గ్రూప్1లోని 503 పోస్టులకు సంబంధించి ఆయా డిపార్ట్మెంట్ల నుంచి వివరాలు సేకరించారు. అయితే మూడు డిపార్ట్మెంట్ల వివరాలు సరిగా లేకపోవడంతో నోటిఫికేషన్ ఆలస్యం అవుతుందని కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. ఆ డిపార్ట్మెంట్ల నుంచి క్లారిఫికేషన్ తీసుకుంటున్నామని, వారి నుంచి రిప్లై రాగానే నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొంటున్నారు. మరోపక్క గ్రూప్1,2 పరీక్షల్లో ఇంటర్వ్యూలను ఎత్తేసినందున.. ఆ మేరకు ఇంటర్వ్యూల మార్కులనూ ఎత్తెయ్యాలని సోమవారం జరిగిన మీటింగ్లో అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది.