TSPSC : ఇద్దరి నుంచి నలుగురికి చేరిన గ్రూప్‌-1 పేపర్‌‌..ఇంకా ఎవరికి చేరిందనే కోణంలో సిట్ దర్యాప్తు

TSPSC : ఇద్దరి నుంచి నలుగురికి చేరిన గ్రూప్‌-1 పేపర్‌‌..ఇంకా ఎవరికి చేరిందనే కోణంలో సిట్ దర్యాప్తు
  • ఐదు రోజుల విచారణకు షమీమ్, రమేశ్, సురేశ్​
  •     మంగళవారంతో ముగిసిన మరో నలుగురి కస్టడీ

హైదరాబాద్‌, వెలుగు: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌1 పేపర్ నలుగురు ఉద్యోగులకు తెలిసే లీక్ అయినట్లు సిట్‌ విచారణలో తేలింది. అసిస్టెంట్​ సెక్షన్​ ఆఫీసర్​ షమీమ్‌, ఔట్​సోర్సింగ్​ డేటాఎంట్రీ ఆపరేటర్‌‌ దామెర రమేశ్ కు లీక్ విషయం తెలియడంతోనే నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌ వారికి పేపర్ షేర్ చేసినట్లు ఆధారాలు సేకరించింది. వారి నుంచే న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌రెడ్డి, సైదాబాద్‌కు చెందిన నలగొప్పుల సురేశ్​కు పేపర్ లీక్​ అయ్యిందని అనుమానిస్తోంది.

అయితే గ్రూప్‌1 పేపర్‌‌ లీక్ సమయంలో వీరి మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని సిట్‌ గుర్తించినట్లు తెలిసింది. లీకైన పేపర్​తో గ్రూప్‌1 పరీక్ష రాసిన షమీమ్‌, రమేశ్‌, సురేశ్​ను ఐదు రోజుల పాటు సిట్‌ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లిలోని 12వ అడిషనల్ చీఫ్‌ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌ ఈశ్వరయ్య మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. బుధవారం నుంచి ఆదివారం వరకు వీరిని సిట్‌ విచారించనుంది.

గ్రూప్-1 పేపర్​ బయటపడలేదనే..

ఏఈ పేపర్ లీకేజీలో ప్రవీణ్‌, రాజశేఖర్‌‌తోపాటు రేణుక భర్త ఢాక్య నాయక్‌, రేణుక తమ్ముడు రాజేశ్వర్‌ నుంచి సిట్​ కీలక సమాచారం రాబట్టింది. ఈ నలుగురి కస్టడీ మంగళవారంతో ముగియడంతో కోర్టులో ప్రొడ్యుస్ చేసింది. కోర్టు ఆదేశాలతో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌కు తరలించింది. కస్టడీ సందర్భంగా నలుగురిని సిట్​ విడివిడిగా ప్రశ్నించి స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేసింది. తర్వాత అందరినీ కలిపి విచారించింది. క్రాస్‌ క్వశ్చనింగ్ చేసింది. ప్రవీణ్, రాజశేఖర్‌ హ్యాక్ చేసిన ఆరు పేపర్ల వివరాలను సిట్​ అధికారులు రాబట్టారు.

అక్టోబర్‌‌లో జరిగిన గ్రూప్​1 ప్రిలిమ్స్​ పేపర్‌ లీక్ బయటపడకపోతే ఏఈ, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్, మరో మూడు పేపర్లు లీక్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. రేణుక, ఆమె భర్త ఢాక్యానాయక్‌, తమ్ముడు రాజేశ్వర్‌ కలిసి సేల్‌ చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ఆధారాలు సేకరించారు. వీరిచ్చిన సమాచారంతో మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్‌కు చెందిన ప్రశాంత్‌రెడ్డి, షాద్‌నగర్‌‌ నేరెళ్లచెరువుకు చెందిన రాజేంద్రకుమార్‌‌, సల్కర్‌‌పేట్‌కు చెందిన తిరుపతయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇద్దరి నుంచి నలుగురికి

ప్రవీణ్‌, రాజశేఖర్‌‌, షమీమ్‌, రమేశ్ అంతా టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులే. నోటిఫికేషన్స్‌ విడుదలైన తర్వాత ప్రవీణ్‌, రాజశేఖర్‌ కలిసి లీక్​కు ప్లాన్ చేసినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. డైనమిక్‌ ఐపీని స్టాటిక్‌ ఐపీగా మార్చి పేపర్స్ హ్యాక్ చేసినట్లు నిర్ధారణకు వచ్చింది. అయితే పేపర్ లీకేజీ విషయం షమీమ్‌, దామెర రమేశ్​కు తెలియడంతోనే వారికి కూడా షేర్ చేసినట్లు బయటడింది.

గ్రూప్‌ 1 పేపర్‌‌ ప్రవీణ్‌ నుంచి షమీమ్‌కు, రాజశేఖర్‌ నుంచి దామెర రమేశ్‌కు, రాజశేఖర్‌ బావ ప్రశాంత్‌రెడ్డికి చేరినట్లు సిట్​ అధికారులు నిర్ధారణకు వచ్చారు.పేపర్‌‌ లీక్​ తర్వాతనే ప్రశాంత్‌రెడ్డి న్యూజిలాండ్‌ నుంచి ఇండియాకు వచ్చి పరీక్ష రాసినట్లు ఆధారాలు సేకరించారు. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల్లో క్వాలిఫై కాని వారికి కూడా పేపర్ లీక్ విషయం తెలుసా అనే కోణంలో సిట్‌ దర్యాప్తు చేస్తున్నది.