గ్రూప్1కు 74 శాతం  హాజరు .. ప్రశాంతంగా ముగిసిన ప్రిలిమ్స్​ ఎగ్జామ్

గ్రూప్1కు 74 శాతం  హాజరు .. ప్రశాంతంగా ముగిసిన ప్రిలిమ్స్​ ఎగ్జామ్

3.02 లక్షల మంది అటెండ్​.. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరిగిన గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 563 పోస్టుల భర్తీ కోసం టీజీపీఎస్సీ నిర్వహించిన ఈ పరీక్షకు 74% మంది హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది అప్లై చేసుకోగా, వారిలో 3.02 లక్షల మంది మాత్రమే పరీక్షకు అటెండ్ అయ్యారు. గతంతో పోలిస్తే పేపర్ కాస్త ఈజీగానే వచ్చిందని అభ్యర్థులు తెలిపారు. కరెంట్ అఫైర్స్ లో పెద్దగా కఠినమైనవేవీ రాలేదన్నారు. అయితే చాలా వరకు క్వశ్చన్లకు ఆప్షన్లు ఎక్కువగా ఇవ్వడంతో ఇబ్బందులు పడ్డామని పేర్కొన్నారు.

ప్రిలిమ్స్ ఎగ్జామ్ కీని త్వరలోనే  కమిషన్ వెబ్ సైట్​లో పెడ్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ జరగనున్నాయి. కాగా, ఒకే గ్రూప్ 1 ఎగ్జామ్​కు సంబంధించిన ప్రిలిమ్స్​ను మూడుసార్లు రాయడం చరిత్రలో ఇదే తొలిసారి అని అభ్యర్థులు అంటున్నారు. వివిధ కారణాలతో గతంలో రెండుసార్లు రద్దు చేశారు. తొలిసారి జరిగిన పరీక్షకు 75% మంది, రెండోసారి 61% మంది హాజరుకాగా.. ఈసారి 74% మంది హాజరయ్యారు. గతంతో పోలిస్తే ఈసారి అప్లికేషన్ల సంఖ్య పెరిగినా, పరీక్ష రాసిన వారి సంఖ్య మాత్రం పెద్దగా పెరగలేదు.  

ఎలక్షన్ కమిషన్, తెలంగాణ మధ్యంతర బడ్జెట్, తెలంగాణ చరిత్రపై క్వశ్చన్లు అడిగారు. ఎకనామిక్స్ లో ఫ్యాక్ట్ బేస్డ్ గా ప్రశ్నలు ఇచ్చారని అభ్యర్థులు తెలిపారు. సిలబస్ పూర్తిగా చదివినవారు మాత్రమే ఆన్సర్ చేయగలరని పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రం టఫ్ గా వచ్చిందని పలువురు అభ్యర్థులు చెప్పారు. ప్రతి పోటీ పరీక్షలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్కీమ్స్ పై క్వశ్చన్లు రావడం సాధారణమే. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలపై ప్రశ్నలు అడిగారు. మహాలక్ష్మీ, గృహజ్యోతి పథకాలపై ప్రశ్నలు ఇచ్చారు.
 
10 గంటలకే గేట్లు క్లోజ్..  

పరీక్ష ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కాగా, ముందుగా చెప్పినట్టే అన్ని సెంటర్లలోనూ 10 గంటలకే గేట్లు మూసేశారు. 10 గంటల తర్వాత ఎవరు వచ్చినా అనుమతించలేదు. మరోవైపు గంట ముందే సెంటర్ల లోపలికి వెళ్లినా ఉపయోగం లేకుండా పోయిందని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. లోపలికి వెళ్లిన వెంటనే బయోమెట్రిక్ తీసుకోలేదని, సరిగ్గా పరీక్ష రాసే సమయంలో బయోమెట్రిక్ అడెంటెన్స్ తీసుకున్నారని తెలిపారు.

దాదాపు అన్ని చోట్ల ఉదయం10:30 నుంచి 11:30 గంటల మధ్య పరీక్ష రాసే సమయంలో బయోమెట్రిక్ తీసుకుని డిస్ట్రబ్ చేశారని పేర్కొన్నారు. ఫొటోతో పాటు రెండు చూపుడు వేళ్ల ముద్రలు తీసుకున్నారు. కాగా, సెంటర్ల బయట ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో అభ్యర్థులు, వారితో వచ్చిన వాళ్లంతా ఇబ్బందులు పడ్డారు.   

జగిత్యాలలో అభ్యర్థుల ఆందోళన  

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల ఎదుట గ్రూప్-1 ప్రిలిమ్స్ అభ్యర్థులు నిరసన తెలిపారు. ఇన్విజిలేటర్ నిర్లక్ష్యం కారణంగా తాము నష్టపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షకు హాజరైన శరత్ చంద్ర మాట్లాడుతూ.. ‘‘ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజీలోని రూమ్ నెంబర్ 213లో 24 మంది అభ్యర్థులం పరీక్ష రాశాం. అయితే ఇన్విజిలేటర్ ను టైమ్ అడిగినప్పుడు ఇంకో అరగంట సమయం ఉన్నప్పటికీ, చివరి 5 నిమిషాలు మాత్రమే ఉందని మిస్ గైడ్ చేశారు. దీంతో మేం నష్టపోయాం” అని తెలిపాడు.

సెంటర్ లో టైమ్ తెలిసేలా బెల్ కొట్టినప్పటికీ సరిగా వినపడలేదని, ఎగ్జామ్ హాల్ లో కనీసం వాల్ క్లాక్ ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. కాగా, కొండగట్టు జేఎన్టీయూ సెంటర్ కు ఐదుగురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. తనను లోపలికి అనుమతించాలంటూ జగిత్యాలకు చెందిన ఓ మహిళ అభ్యర్థి దాదాపు గంటపాటు ఏడుస్తూ సెంటర్ బయటే వేచి చూసి తిరిగి వెళ్లిపోయింది. కోరుట్ల మాస్ట్రో జూనియర్ కాలేజీ పరీక్ష కేంద్రానికి ముగ్గురు అభ్యర్థులు 3 నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు లోపలకి అనుమతించలేదు.