హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలోనే గ్రూప్ 2, 3 పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. గురువారం అసెంబ్లీలోని సీఎల్పీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్చేస్తామని, ఉద్యోగ ఖాళీలు గుర్తించి మళ్లీ నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామన్నారు.
గ్రూప్ 2, 3 పోస్టులను పెంచాలని కొందరు ధర్నాలు చేస్తున్నారని, ఇప్పటికే ఐదున్నర లక్షల మంది అప్లై చేసుకున్నారని తెలిపారు. వాటిని క్యాన్సిల్ చేస్తే ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. ఇప్పటికే మెగా డీఎస్సీ వేశామని, జీవో 46పై న్యాయ సలహా తీసుకుని ముందుకెళ్తామన్నారు. గ్రూప్ -1 విషయంలో 1:100 తీయాలనే డిమాండ్ ఉన్నదని, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. నిరుద్యోగులు ఏ విషయంలోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ ప్రభుత్వం పూర్తిస్థాయిలో వారికి అండగా ఉంటుందన్నారు.
నీట్ నిర్వహణలో ఎన్డీయే సర్కార్ విఫలం
నీట్ పరీక్ష నిర్వహణలో, ఫలితాల్లో చాలా మందికి అన్యాయం జరిగిందని, దీనిపై కేంద్రం స్పందించాలని మంత్రి డిమాండ్ చేశారు. దరఖాస్తుల గడువు పొడిగింపు, ప్రకటించిన సమయం కంటే ముందే ఫలితాలు ఇవ్వడం, 63 మంది స్టూడెంట్స్కు ఒకే ర్యాంక్ రావడం, గ్రేస్ మార్కులు కలపడం వంటి అంశాలపై అనుమానాలున్నాయన్నారు. నీట్ లో అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించి, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. నీట్ నిర్వహణలో ఎన్డీయే సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
