నవంబర్లో గ్రూప్ 2 .. మూడు నెలలు వాయిదా

నవంబర్లో  గ్రూప్ 2 .. మూడు నెలలు వాయిదా

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 2 అభ్యర్థుల పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఎట్టకేలకు గ్రూప్ 2 ఎగ్జామ్ ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29, 30 తేదీల్లో ఎగ్జామ్ జరగాల్సి ఉండగా.. నవంబర్ లో నిర్వహించనున్నట్టు ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సీఎస్​ శాంతికుమారి శనివారం రాత్రి టీఎస్​పీఎస్సీ చైర్మన్ ​జనార్దన్​రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్​తో చర్చించారు. లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన చెందుతుండడంతో పరీక్ష తేదీలను రీషెడ్యూల్​ చేయాలని కోరారు. తమ సూచన మేరకు గ్రూప్ 2 ​పరీక్షలను నవంబర్​లో నిర్వహించాలని టీఎస్​పీఎస్సీ నిర్ణయం తీసుకుందని సీఎస్​ ప్రకటన విడుదల చేశారు. 

అంతకుముందు గ్రూప్​2 ఎగ్జామ్ వాయిదా వేయనున్నట్టు మంత్రి కేటీఆర్​ట్విట్టర్​లో ప్రకటించారు. ‘‘గ్రూప్​2 ఎగ్జామ్ కు ప్రిపేర్​అవుతున్న లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలి. దీనిపై టీఎస్​పీఎస్సీతో చర్చించి పరీక్షను రీషెడ్యూల్​చేయాలి” అని సీఎస్​శాంతికుమారిని సీఎం కేసీఆర్​ఆదేశించారని ఆయన​ట్వీట్​చేశారు. ‘‘భవిష్యత్తులోనూ రిక్రూట్​మెంట్​నోటిఫికేషన్ల విడుదల ప్రాపర్​గా ఉండాలి. 

ఆయా పరీక్షలు రాసేందుకు అర్హత ఉన్నవాళ్లందరూ ప్రిపేర్​అయ్యేందుకు తగిన సమయం ఇవ్వాలి. దీనిపైనా టీఎస్​పీఎస్సీతో చర్చించాలి” అని సీఎస్ కు సీఎం సూచించారని పేర్కొన్నారు. కాగా, గ్రూప్​2 ఎగ్జామ్ ను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు రెండ్రోజుల కింద టీఎస్​పీఎస్సీని ముట్టడించారు. ప్రతిపక్షాలతో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా పరీక్ష వాయిదా వేయాలని కోరారు. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు.