పొన్నం vs అలిగిరెడ్డి .. హుస్నాబాద్ కాంగ్రెస్​లో గ్రూప్​ రాజకీయాలు

పొన్నం vs అలిగిరెడ్డి ..   హుస్నాబాద్ కాంగ్రెస్​లో గ్రూప్​ రాజకీయాలు
  •  పొన్నం, అలిగిరెడ్డి వర్గాలుగా చీలిన కార్యకర్తలు
  •   ఇరు వర్గాల  మధ్య బాహా బాహీతో బహిర్గతం

సిద్దిపేట/హుస్నాబాద్, వెలుగు :  హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్​ రాజకీయాలు బయటపడ్డాయి. నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్,  మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అనుచరులు మొన్నటి వరకు ఐక్యంగా ఉన్నామనే సంకేతాలు పంపినా... ఇప్పుడు గ్రూపులుగా విడిపోయి బలప్రదర్శనకు దిగుతున్నారు. నాలుగు రోజుల కింద ఏఐసీసీ వర్కింగ్​ కమిటీ మెంబర్​మోహన్​ ప్రకాశ్​ఆరు గ్యారెంటీ స్కీంల ప్రచారానికి  హుస్నాబాద్​లో పర్యటించారు.  ఆ సమయంలో ఇరువర్గాల మధ్య డీజే  వెహికల్ విషయంలో జరిగిన రాద్దాంతం ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లింది. పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. అంతర్గత పోరు ఎంత తీవ్రంగా ఉందో ఈ ఘటన ద్వారా బయటపడింది. 

టికెట్ ​ఇద్దరిలో ఎవరికో?

హుస్నాబాద్  కాంగ్రెస్ టికెట్ కోసం ఆరుగురు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మాజీ  ఎమ్మెల్యే  అల్గిరెడ్డి ప్రవీణ్​రెడ్డి,  వొంటెల లింగారెడ్డి,  బొలిశెట్టి శివయ్య, వొంటెల రత్నాకర్, గజ్జెల మల్లేశ్ తో పాటు మాజీ కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గతంలో ఎంపీగా పొటీ చేసినప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గంలో దాదాపు 49 వేల ఓట్లు  వచ్చాయి.  బీసీలు ఎక్కువగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేయడానికి ఆయన దరఖాస్తు చేశారు. అయితే ఆరుగురిలో పొన్నం, అల్గిరెడ్డి మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా హుస్నాబాద్ స్థానం సీపీఐకి కేటాయించడంతో  పోటీకి దూరంగా ఉన్న అల్గిరెడ్డి ప్రవీణ్​ రెడ్డి తరువాత  బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవలే తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అల్గిరెడ్డి ప్రవీణ్​ రెడ్డికే కాంగ్రెస్ టికెట్  వస్తుందనుకుంటున్న  సమయంలో అసూహ్యంగా పొన్నం ప్రభాకర్ టికెట్​ కోసం దరఖాస్తు చేయడంతో ఎవరికి అవకాశం వస్తోందోనన్న ఆసక్తి నెలకొంది. 

సహకారం ఉంటుందా? లేదా? 

టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న  పొన్నం, అల్గిరెడ్డి కలిసి కొన్ని రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించారు. ఇది చూసి కింది స్థాయి కార్యకర్తలు టికెట్ ఎవరికి వచ్చినా అందరూ కలిసి పనిచేస్తారని అనుకుంటున్న తరుణంలో గ్రూపుల గొడవ బజారున పడటంతో ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఇద్దరిలో టికెట్​ ఎవరికి దక్కినా మరొకరు పూర్తి స్థాయి సహకారం అందిస్తారా? లేదా? అనే సందేహం కలుగుతోంది.