కాంగ్రెస్ లో ఎవరి గోల వారిదే! .. గజ్వేల్​లో గ్రూపుల బాహాబాహి

కాంగ్రెస్ లో ఎవరి గోల వారిదే! ..  గజ్వేల్​లో గ్రూపుల బాహాబాహి
  •  గజ్వేల్​లో గ్రూపుల బాహాబాహి
  •  సిద్దిపేటలో తెరపైకి స్థానికత
  •  దుబ్బాకలో లోపించిన ఐక్యత

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్​ నేతల వ్యవహారం ఎవరి గోల వారిదే అన్నట్టుగా ఉంది. పార్టీ కార్యక్రమాలను ఎవరికి వారే నిర్వహించడమే కాకుండా ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. హైకమాండ్​కు కంప్లేంట్స్​​ చేసే వరకూ వెళ్తుండడం కార్యకర్తలను ఆందోళనలకు గురి చేస్తోంది. ఇలాంటి పరిస్థితి ఉన్నా హైకమాండ్​ మాత్రం చక్కదిద్దే చర్యలేవీ చేపట్టకపోవడం గమనార్హం. 

గజ్వేల్​లో గ్రూప్​ రాజకీయాలు 

సీఎం కేసీఆర్ ప్రాతనిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో దీటుగా ఎదగాల్సిన  కాంగ్రెస్ పార్టీ గ్రూపుల గొడవలతో సతమతమవుతోంది. గజ్వేల్ సీటును ఆశిస్తున్న డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కొంత కాలంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నాడు.  అలాగే ఆశావహులు  శ్రీకాంత్ రావు, జశ్వంతరెడ్డి సైతం అప్పుడప్పుడు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చిన ఏ ఒక్క కార్యక్రమాన్ని అందరూ కలిసి నిర్వహించే పరిస్థితి లేదు. పైగా గ్రూపుల గొడవలు బజారున పడి పీసీసీకి ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్లాయి. ఇటీవల యూత్ కాంగ్రెస్ కార్యక్రమంలో వంటి మామిడి వద్ద గ్రూపుల గొడవలు మొదలు కాగా ప్రజ్ఞాపూర్ లో ఏకంగా శ్రీకాంత్ రావు, జశ్వంతరెడ్డి పై  నర్సారెడ్డి అనుచరులు బాహాబాహీకి దిగారు. దాడిపై శ్రీకాంత్ రావు, జశ్వంత్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో సైతం ఫిర్యాదు చేశారు. దీనిని  టీపీసీసీ నేతల దృష్టికి కూడా తీసుకెళ్లారు. 

దుబ్బాక లో మూడు వర్గాలు 

దుబ్బాక కాంగ్రెస్ లోనూ పరిస్థితి ఎవరి యాత్రలు వారివే అన్నట్టుగా ఉంది. గత ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చెరుకు శ్రీనివాస్​రెడ్డి ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన యాంకర్ కత్తి కార్తీక గౌడ్ పల్లె పల్లెన పర్యటిస్తోంది. టీపీసీసీ నేత  శ్రవణ్​ కుమార్ రెడ్డి సైతం తమదైన రీతిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ పోటీలో ఉన్నానని చెప్పకనే చెబుతున్నారు. టీపీసీసీ ప్రచార కమిటీలో  కత్తి కార్తీక స్థానం పొంది రాహుల్ గాంధీ ఆశీర్వాదంతో  టికెట్ తనకేనన్న ధీమాతో ఉన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అండదండలతో చెరుకు శ్రీనివాస్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మద్దతుతో శ్రవణ్​ కుమార్ రెడ్డి దుబ్బాక టికెట్ తనకే దక్కుతుందనే ఆశలో ఉన్నారు. రెండు రోజుల కింద దుబ్బాక పట్టణానికి వచ్చిన శ్రవణ్​ కుమార్ రెడ్డికి ఆయన వర్గీయులు మాత్రమే ఘనంగా స్వాగతం పలికి భారీ ర్యాలీ తీశారు. ముగ్గురు నేతలు పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కలిసి పాల్గొన్న సందర్భాలు లేకపోవడం గమనార్హం. 

సిద్దిపేటలో తెరపైకి ‘స్థానికత

సిద్దిపేట కాంగ్రెస్ టికెట్ ను స్థానికులకే ఇవ్వాలనే డిమాండ్ ను నేతలు తెరపైకి తెస్తున్నారు. ఈ టికెట్ ను ఇప్పటికే ఐదుగురు నేతలు ఆశిస్తూ ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే పార్టీ కార్యక్రమాల విషయంలో ఐక్యంగా నిలవని నేతలు స్థానికులకే టికెట్ ఇవ్వాలనే విషయంలో ఐక్యంగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం టికెట్ రేసులో తాడూరి శ్రీనివాస్ గౌడ్, దర్పల్లి చంద్రం, గూడూరి శ్రీనివాస్, సూర్యచంద్ర వర్మ, గంప మహేందర్ రావు ఉన్నారు.

ఇక్కడి కాంగ్రెస్ టికెట్ మహిళా నేతకు  దక్కుతుందనే ప్రచారంతో ఇటీవల మెదక్ పార్లమెంట్ ఇన్​చార్జి విష్ణునాథ్ సిద్దిపేట పర్యటన సందర్భంగా స్థానికులకే టికెట్ ఇవ్వాలని కోరుతూ పార్టీ పెద్దలకు వినతి పత్రం సమర్పించారు. సిద్దిపేట లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రయత్నిస్తున్న సదరు మహిళా నేత గతంలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొనగా ‘మిమ్మల్ని ఎవరు ఆహ్వానించారు.. ఇక్కడికి ఎందుకొచ్చారు’ అని కొందరు నేతలు గొడవకు దిగిన సందర్భం ఉంది. ఇటీవల నియోజకవర్గంలో మళ్లీ ఆమె పర్యటనలు చేస్తుండడంపై  టికెట్ ను ఆశిస్తున్న నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.