ఐఏఎస్​లలో గ్రూప్​ పాలిటిక్స్..

ఐఏఎస్​లలో గ్రూప్​ పాలిటిక్స్..
  • బీహార్, నాన్ బీహార్ టీమ్​లుగా విడిపోయిన ఆఫీసర్లు
  • అన్నింటా బీహార్​ టీమ్​దే పెత్తనం
  • బాధితుల జాబితాలో తెలంగాణ ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐఏఎస్​ ఆఫీసర్ల మధ్య విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. లీడర్లు తానా అంటే తందానా అన్నట్లుగా వ్యవహరించే కొందరు ఐఏఎస్​లకు, ఇతర ఐఏఎస్​లకు మధ్య ఏ మాత్రం పొసగడం లేదు. మరోవైపు అనుభవం లేని ఆఫీసర్లకు కీలకమైన శాఖలు ఇస్తున్నారని, దీంతో ప్రభుత్వ విధానాల అమల్లో తప్పిదాలు జరుగుతున్నాయని రిటైర్డ్​ ఐఏఎస్​ ఆఫీసర్లు అంటున్నారు. ఇందుకు వరద సాయం పంపిణీ, ధరణి పోర్టల్​ నిర్వహణ తీరే ఉదాహరణ అని గుర్తు చేస్తున్నారు.

రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్లు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఇందులో ఒకటి బీహార్ టీమ్​.. మరొకటి ఇతర రాష్ట్రాల టీమ్​ (నాన్​ బీహార్​ టీమ్​​).  ఏ చిన్న చాన్స్ దొరికినా రెండు గ్రూప్​లు ఒకరినొకరు బలహీన పర్చుకునేందుకు రెడీగా అవుతాయి. ఏడాది కింద 12 మంది సీనియర్లను కాదని సీనియార్టీ లిస్టులో 13వ స్థానంలో ఉన్న సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ చీఫ్ సెక్రటరీగా చేశారు. అప్పటి నుంచి బీహార్​ టీమ్​ ఆఫీసర్ల లాబీయింగ్ పుంజుకుందని ఆఫీసర్ల మధ్య చర్చ నడుస్తోంది. తాజాగా ఐఏఎస్  ఆఫీసర్ల సంఘం బై లాస్ ను బీహార్ టీమ్ తమకు అనుకూలంగా మల్చుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. టీఆర్​ఎస్​ తొలి టర్మ్​లో రాజీవ్​శర్మ అనుసరించినట్లుగానే ఇప్పుడు  సోమేశ్ కుమార్ తనకు ఇష్టమైన ఆఫీసర్లకు కీలకమైన పోస్టులు ఇప్పించుకుని, గిట్టనివారిని  ప్రాధాన్యం లేని శాఖలకు పంపుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. సెక్రటేరియట్ లో పనిచేసిన అనుభవంలేని అధికారులను కీలకమైన ఫైనాన్స్ విభాగంలో నియమించినట్లు, ప్రమోట్ ఐఏఎస్ లకు కీలక బాధ్యతలు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. సీనియర్​ ఆఫీసర్లయిన శాంతికుమారి, అధర్ సిన్హా, చిత్రా రామచంద్రన్​ను అప్రాధాన్య పోస్టులకు పంపించినట్లు విమర్శలున్నాయి.

సీనియర్లకు పొగ.. జూనియర్లకు కీ పోస్టులు

అనుభవం లేని జూనియర్ ఆఫీసర్లకు కీలక పోస్టింగ్ లు  ఇచ్చి స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్న ఆఫీసర్లను పక్కనబెట్టడం వివాదాస్పదమవుతోంది. ఏడాదిన్నర కింద సీనియర్ ఆఫీసర్లకు సరైన పోస్టింగ్ ఇవ్వడం లేదనే కారణంతో ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి వీఆర్ఎస్ తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో ఆయన సలహాదారుడిగా ఉన్నారు. రాష్ట్రంలో స్పెషల్ సీఎస్ హోదాలో 11 మంది ఆఫీసర్లు ఉంటే.. అందులో ఎక్కువ మందిని లూప్ లైన్ లోకి పంపించారు. ఆరేండ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బుర్ర వెంకటేశంను లూప్ లైన్ లో పడేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ఐఏఎస్​లలో చర్చ నడుస్తోంది. సర్వీస్ లో ఎన్నడూ తెలంగాణ జిల్లాల్లో పనిచేయని ఆఫీసర్లు ఇప్పుడు సెక్రటేరియట్ లో కీలక పోస్టుల్లో ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. తెలంగాణకు చెందిన ఐఏఎస్ లు చాలా మంది ఉన్నా వారికి ఎందుకు ప్రయార్టీ ఇవ్వడం లేదని సెక్రటేరియట్​ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన వాళ్లను పక్కనబెట్టి.. నార్త్ ఆఫీసర్లకు పవర్ ఇచ్చినట్లయిందని అంటున్నాయి. ఇటీవల తెలంగాణ కేడర్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్​ శ్రీలక్ష్మికి  ఏపీకి వెళ్లేందుకు ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. ఏపీకి  ట్రాన్స్ ఫర్ అయ్యేందుకు ఆమెకు క్యాట్ అనుకూలంగా తీర్పు ఇచ్చింది.  రూల్స్‌‌ ప్రకారం క్యాట్ తీర్పు అమలు బాధ్యత కేంద్రంపై ఉంటుంది. కానీ  కేంద్రం నుంచి ఎలాంటి  సమాచారం రాకముందే శ్రీలక్ష్మిని తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటనే  చర్చ జరుగుతోంది.

ఒక్కొక్కరికి రెండు మూడు బాధ్యతలు

కొందరు ఆఫీసర్లకు రెండు మూడు బాధ్యతలు అప్పజెప్పారు. సీఎస్ సోమేశ్ కుమార్ రెవెన్యూ, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, సీసీఎల్ఏ బాధ్యతలు చూస్తున్నారు. అర్వింద్ కుమార్  మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐ అండ్ పీఆర్, హెచ్ఎండీఏ కమిషనర్ గా ఉన్నారు. సునీల్ శర్మ  ఆర్ అండ్ బీ, హౌజింగ్, ట్రాన్స్ పోర్ట్ శాఖలకు సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. అనిల్ కుమార్  సివిల్ సప్లయ్స్​ కమిషనర్ , ఎండోమెంట్ సెక్రటరీగా ఉన్నారు. అగ్రికల్చర్ డిపార్ట్​మెంట్​కు సెక్రటరీ, కమిషనర్​గా జనార్దన్​రెడ్డి.. ఎస్సీ సంక్షేమ శాఖకు సెక్రటరీ, కమిషనర్​గా రాహుల్​ బొజ్జా.. ఎస్టీ శాఖకు సెక్రటరీ, కమిషనర్​గా క్రిస్టినా చోంగ్తు,  బీసీ సంక్షేమ శాఖకు సెక్రటరీ, కమిషనర్ గా బుర్రా వెంకటేశం ఉన్నారు. ఎక్కువ శాఖలు ఒకరి దగ్గరే ఉండటం వల్ల ఫైళ్లు వెంటనే క్లియర్ కావడం లేదని, పెండింగ్​లో పడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. కమిషనర్ ప్రపోజల్​ పంపితే దాన్ని ఎగ్జామ్​ చేసి, నిర్ణయం తీసుకునే అధికారం సెక్రటరీకి ఉంటుంది. కానీ కొన్ని శాఖల్లో కమిషనర్, సెక్రటరీ బాధ్యతలను ఒక్కరే నిర్వహిస్తుండటంతో.. క్రాస్​ చెకింగ్​ లేకుండా పోతోందనే ఆరోపణలు ఉన్నాయి.

ఒక్కొక్కరూ ఒక్కో నిర్ణయం

విభేదాల కారణంగా ఐఏఎస్​ ఆఫీసర్లు ఒకరికొకరు పొంతన లేని నిర్ణయాలు తీసుకుంటున్నారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా సెప్టెంబర్​ 1 నుంచి స్కూల్స్ ప్రారంభించాలని చిత్రా రామచంద్రన్ జీవో జారీ చేశారు. దానికి విరుద్దంగా సీఎస్ సెప్టెంబర్​ 20 వరకు స్కూల్స్ తెరవద్దని మరో జీవో ఇచ్చారు. హైదరాబాద్ వరద బాధితులకు రూ. పదివేల సాయం సమయంలో అనుభవంలేని ఆఫీసర్లకు బాధ్యతలు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి మేలు కంటే నష్టమే ఎక్కువగా జరిగిందని రిటైర్ట్  ఆఫీసర్లు చెబుతున్నారు.  కరోనా సమయంలో జూనియర్ ఆఫీసర్లకు బాధ్యతలు ఇవ్వడం వల్ల అనుకున్న మేరకు టెస్టులు చేయలేక పోయారనే ఆరోపణలు ఉన్నాయి. ధరణి తయారీ బాధ్యతలను కూడా అనుభవం లేని వారికి అప్పగించడం వల్లే బూమ్​ రంగ్​ అయిందనే విమర్శలు ఉన్నాయి.

సీఎస్ సోమేశ్‌‌‌‌ను తప్పించేందుకు లాబీయింగ్

వరుస వివాదాలతో సోమేశ్ కుమార్ ను చీఫ్ సెక్రటరీ పోస్టు నుంచి తప్పించాలని ఆయన వ్యతిరేక వర్గం ఆఫీసర్లు పావులు కదుపుతున్నారు.  నగదు రూపంలో వరద సాయం అందించాలనే నిర్ణయం, ఎల్ఆర్ఎస్, ధరణి ఏర్పాటు సోమేశ్ ఆలోచనతోనే జరిగాయని, అవన్నీ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చాయని అంటున్నారు.

అసోసియేషన్  కేంద్రంగా తాజా వివాదం

ఐఏఎస్ ఆఫీసర్ల మధ్య ఉన్న గ్రూపు తగాదాలు అసోసియేషన్  బై లాస్ మార్చడంతో తారా స్థాయికి చేరాయి. సీఎస్ సోమేశ్ కోసమే ముందస్తు సమాచారం లేకుండా బై లాస్ మార్చినట్లు వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. గతంలో ఉన్న బై లాస్ ప్రకారం.. సీఎస్ తర్వాత హైదరాబాద్ లో ఉండే సీనియర్ అధికారి.. సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించేవారు. కానీ ఇటీవలి జనరల్ బాడీ మీటింగ్ లో సీఎస్సే అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తారని బైలాస్​లో మార్పులు చేశారు. దీని వెనుక సీఎస్ కు అనుకూలంగా ఉన్న ఐఏఎస్ లు వికాస్ రాజ్, అర్వింద్ కుమార్, జయేశ్ రంజన్  ఉన్నారని  నాన్​ బీహార్​ టీమ్​ ఆరోపిస్తోంది.