వీకెండ్ ట్రిప్​లకు మస్తు క్రేజ్

వీకెండ్ ట్రిప్​లకు మస్తు క్రేజ్
  • సిటీకి 500 కి.మీ లోపు ప్రాంతాలే టార్గెట్​గా జర్నీ
  • ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో కలిసి ఓన్ వెహికల్స్​లో వెళ్లేందుకు ఇంట్రెస్ట్

హైదరాబాద్, వెలుగు: కరోనా సెకండ్ వేవ్ తర్వాత సిటీ నుంచి ఇతర రాష్ట్రాల్లోని టూరిజం ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.  ఈ ఏడాది అన్ లాక్ తర్వాత  వర్క్ ఫ్రమ్ చేస్తున్న ఐటీ ఎంప్లాయీస్ తో పాటు ఇతర జాబ్ లు చేస్తున్న వారు పని ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందేందుకు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి టూర్లకు వెళ్లి వచ్చారు. ప్రస్తుతం వింటర్ సీజన్ కావడంతో బీచ్ ఏరియాలు, హిల్ స్టేషన్లకు వెళ్లేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రాకతో ముందస్తుగా ట్రిప్ లకు ప్లాన్ చేసుకుంటున్నారు. క్రిస్మస్, డిసెంబర్ 31ను సెలబ్రేట్ చేసుకునేందుకు సిటీకి 500 కి.మీలోపు ప్రాంతాలను సెలక్ట్ చేసుకుంటున్నారు.  గోవా, కర్ణాటక, మహారాష్ట్రలోని పర్యాటక ప్రాంతాల్లోని రిసార్టులు, హోటళ్లలో రూమ్​లను ముందస్తుగా బుక్ చేసుకుంటున్నరు.    

సెల్ఫ్ ప్లానింగ్​తో.. 

ఒమిక్రాన్ రాకతో చాలామంది ఓన్ వెహికల్స్ లో వెళ్లడమే బెటర్ అని ఫీలవుతున్నారు. సొంత కార్లు లేకుంటే రెంట్ కి తీసుకుని టూర్లకు ప్లాన్  చేసుకుంటున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి సెల్ఫ్ ప్లానింగ్ తో సిటీకి దగ్గరగా ఉండే టూరిజం ప్రాంతాలకు వెళ్తున్నారు. వికారాబాద్ లోని అనంతగిరి హిల్స్, ఆదిలాబాద్ లోని బోయకొండ, ములుగు జిల్లాలోని బొగత, శ్రీశైలం దగ్గరలోని మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్ ను చాలామంది విజిట్ చేస్తున్నారు. మరికొందరు తక్కువ బడ్జెట్ లో ట్రిప్ లకు తీసుకెళ్లే టూరిజం సంస్థలను కాంటాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లోని హిల్ స్టేషన్, గ్రీనరీ, బీచ్ ఏరియాలు, వాటర్ ఫాల్స్ ఉన్న ప్రాంతాలకు సిటీ నుంచి వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది.  చాలామంది వీకెండ్ లో టూర్లకు ప్లాన్ చేసుకుంటుండగా.. సిటీకి వెయ్యి కి.మీలోపు ఉండే హిల్ స్టేషన్లు ఏపీలోని అరకు, లంబసింగి,వజ్రంగి, ఈస్ట్ గోదావరిలోని మారేడ్ మిల్లి, కర్ణాటకలోని చిక్ మంగుళూరు, హంపి, ఉడిపి, గోకర్ణ, మురుదేశ్వర్, బడామి, నాగర్ హోల్ నేషనల్ పార్కులకు ఎక్కువగా వెళ్తున్నారు. 

సోషల్ మీడియాలో పోస్టులు.. 

బడ్జెట్ ట్రిప్​లను అందించే కొన్ని టూరిజం కంపెనీలు సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తున్నాయి. ఫేస్ బుక్ ,ఇన్ స్టాగ్రామ్​లో తక్కువ బడ్జెట్​లో ట్రిప్​ల గురించి పోస్టులను పెడుతూ సిటిజన్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ‘ ప్రతి వీకెండ్ మా సంస్థ నుంచి లంబసింగి, వజ్రంగి, అరకు, కర్ణాటకలోని చిక్ మంగళూరు, గోకర్ణ, మురుదేశ్వర్ ఏరియాలకు తక్కువ బడ్జెట్ లో ట్రిప్ లను ప్రొవైడ్ చేస్తున్నాం. వీటికి సంబంధించిన సమాచారాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాం’ అని హైదరాబాద్ క్యాంపెయినింగ్ క్లబ్ నిర్వాహకుడు చందు తెలిపాడు. 

ఫుల్ ఎంజాయ్ చేశాం  

ఏడాదిన్నర కాలంగా వర్క్ ఫ్రమ్ హోంతో ఇంట్లోనే  ఉన్నా. గత నెల చివరి వారంలో వరుస సెలవులు రావడంతో ఫ్రెండ్స్​తో కలిసి ట్రిప్​కి వెళ్లా. గోకర్ణ, మురు దేశ్వర్ వెళ్లేందుకు ఇన్ స్టాగ్రామ్​లో ఓ టూరిజం కంపెనీ  పోస్టును చూసి వారిని కాంటాక్ట్ అయ్యాం. మురుదేశ్వర్ టెంపుల్ దగ్గర సన్ సెట్ వ్యూ, గోకర్ణలోని బీచ్​​లో బోట్ రైడింగ్​ను బాగా ఎంజాయ్​ చేశాం.

– వివేక్ రెడ్డి, ఐటీ ఎంప్లాయ్, లింగంపల్లి