
- ఫస్టియర్ అడ్మిషన్లు లక్ష
- టాప్‌లో మహబూబ్‌నగర్, వరంగల్ రూరల్ లాస్ట్
- ఒకేషనల్ కోర్సులపై స్టూడెంట్ల నమ్మకం
హైదరాబాద్, వెలుగు:
సర్కారీ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ అడ్మిషన్లు లక్ష దాటాయి. గతేడాదితో పోలిస్తే స్టూడెంట్ల సంఖ్య పెరిగింది. ఆన్‌లైన్లో అడ్మిషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఇతర సంక్షేమ శాఖలకు చెందిన స్కూళ్లు.. జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ అయినా, సర్కారీ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు మాత్రం తగ్గలేదు.
ఒకేషనల్ కోర్సుల్లో జోష్
రాష్ట్రంలో 404 ప్రభుత్వం జూనియర్ కాలేజీలుండగా, వీటిలో 4 పూర్తిగా ఒకేషనల్ కోర్సులను అందిస్తున్నాయి. 2019–20లో సర్కారీ కాలేజీల్లో మొత్తం 1,00,048 మంది చేరారు. ఇందులో 78,203 మంది జనరల్.. 21,845 మంది ఒకేషనల్ స్టూడెంట్లు. మహబూబ్‌నగర్ జిల్లాలోని 21 కాలేజీల్లో అత్యధికంగా 6,978 మంది చేరగా, వరంగల్ రూరల్ జిల్లాలోని 11 కాలేజీల్లో అత్యల్పంగా 933 మంది చేరారు. ఈ ఏడాది సర్కారీ ఒకేషనల్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. గతేడాది ఆయా కోర్సుల్లో 18 వేల మంది చదివితే, ఈ ఏడాది ఆ సంఖ్య 21,845 కు చేరింది. ఈ ఏడాది కొత్తగా 84 కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలను ఇంటర్ ఫస్టియర్‌కు అప్‌గ్రేడ్ చేశారు. వీటి ఎఫెక్ట్ సర్కారీ కాలేజీల అడ్మిషన్లపై పడుతుందని అధికారులు భావించినా.. ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో రికార్డు స్థాయిలో స్టూడెంట్లు పాస్ కావడంతో 1.20 లక్షల మందిని కాలేజీల్లో చేర్పించాలని ఇంటర్ బోర్డు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
స్టూడెంట్స్‌కు ఆశచూపి..
మూడేండ్ల కింద సర్కారీ కాలేజీల్లో ‘మిడ్ డే మిల్స్’ అమలు చేస్తామని, స్టూడెంట్లకు ఫ్రీ బస్ పాస్‌లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ హామీలను ఏటా వాయిదా వేస్తూ వస్తోంది. సర్కారీ కాలేజీల్లో మంచి రిజల్ట్స్ వస్తుండటంతోపాటు ఎంసెట్ కోచింగ్ కూడా ఇస్తున్నారు. కాలేజీల్లో వచ్చిన మార్పులు, సర్కార్ ఇచ్చిన హామీలను నమ్మి స్టూడెంట్లు కాలేజీల్లో చేరుతున్నారని లెక్చరర్లు చెప్తున్నారు. ఆ హామీల ప్రభావంతోనే మూడేండ్లలో పది వేలకుపైగా అడ్మిషన్లు పెరిగాయంటున్నారు.
సర్కారీ కాలేజీల్లో అడ్మిషన్లు
సంవత్సరం స్టూడెంట్స్
2016-17 90,716
2017-18 91,578
2018-19 99,345
2019-20 1,00,048
(ఇప్పటివరకు)