ఐదేండ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం... దేశంలో రెండో స్థానంలో తెలంగాణ : కేంద్రం రిపోర్టు

ఐదేండ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం... దేశంలో రెండో స్థానంలో తెలంగాణ : కేంద్రం రిపోర్టు
  • అంగన్‌‌‌‌వాడీల్లో స్పెషల్ డ్రైవ్​కు రాష్ట్ర సర్కార్​ నిర్ణయం 
  • తక్కువ ఎత్తు, తక్కువ బరువు, రక్తహీనతతో బాధపడ్తున్న పిల్లలను గుర్తించాలని అధికారులకు ఆదేశం  
  • రెండో దశలో 14 ఏండ్లలోపు పిల్లల గుర్తింపు 
  • బాధిత చిన్నారులకు అవసరమైన సప్లిమెంట్స్‌‌‌‌ ఫ్రీగా అందించనున్న ప్రభుత్వం 
  • పిల్లలకు కండ్లు, ఈఎన్టీ పరీక్షలతో పాటు ఉచితంగా ట్రీట్‌‌‌‌మెంట్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐదేండ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం ఎక్కువగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం రిపోర్టు ఇచ్చింది. దీనికితోడు తక్కువ బరువు, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడ్తున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో పిల్లల్లో పౌష్టికాహార లోపంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌‌‌‌గా దృష్టిపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంగన్‌‌‌‌వాడీ కేంద్రాల్లో స్పెషల్ ​డ్రైవ్ ​చేపట్టాలని నిర్ణయించింది. తక్కువ ఎత్తు, తక్కువ బరువు, రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. 

పిల్లల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఇప్పటికే మహిళా శిశు సంక్షేమ శాఖ కృషి చేస్తుండగా.. ఈ  డ్రైవ్‌‌‌‌ తర్వాత ఎదుగుదల లోపం ఉన్న పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిసింది.  తొలుత అంగన్‌‌‌‌వాడీ కేంద్రాల్లో ఐదేండ్లలోపు పిల్లలను గుర్తించి.. క్రమంగా స్కూళ్లు, ఇంటింటి సర్వే ద్వారా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న 14 ఏండ్లలోపు పిల్లలను గుర్తించనున్నారు. అనంతరం బాధిత చిన్నారులకు ప్రభుత్వమే ఉచితంగా అవసరమైన ఆహార పదార్థాలు, సప్లిమెంట్లను సరఫరా చేయనుంది. వైద్య పరీక్షలు కూడా నిర్వహించనుంది. దీంతో పాటు వినికిడి లోపం, కంటి చూపు మందగించడం, మాట రాకపోవడం లాంటి సమస్యలకూ ట్రీట్‌‌‌‌మెంట్ అందించనుంది. ఈఎన్‌‌‌‌టీ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అయ్యే ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరించనుంది.. 

ప్రతి చిన్నారికీ హెల్త్​కార్డు.. 

అంగన్‌‌‌‌‌‌‌వాడీలు, స్కూళ్లు, ఇంటింటి సర్వే ద్వారా14 ఏండ్లలోపు పిల్లలందరి ఆరోగ్య వివరాలను సమగ్రంగా నమోదు చేసి.. వారి ఎదుగుదల, ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి పకడ్బందీ డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం ప్రతి చిన్నారికి ‘చైల్డ్ హెల్త్ కార్డు’ తప్పనిసరి చేయాలని చూస్తున్నది. పోషకాహార లోపానికి ప్రధాన కారణాలైన ఆహార భద్రత, శుభ్రమైన నీరు, పారిశుధ్యం, తల్లిదండ్రుల విద్యాస్థాయి, ఆరోగ్యంపై అవగాహన, కుటుంబ ఆదాయం వంటి అంశాలపై మరింత లోతుగా విశ్లేషించాలని నిర్ణయించింది. 

నిర్ణీత కాలంలో పిల్లల ఆరోగ్య స్థితిని పర్యవేక్షించడం, పౌష్టికాహారం, పిల్లల సంరక్షణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, వైద్య నిపుణులతో నిరంతరం పర్యవేక్షణ, అవసరమైన చికిత్స అందించడం ద్వారా పిల్లలు వయసుకు తగిన ఎత్తు, బరువు, రక్తహీనత లేకుండా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా పిల్లల్లో చిన్న వయసులోనే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడం, దాని ఆధారంగా ఎంత మేరకు పోషకాహారం అందించాలనే దానిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నది. 

35 శాతం మంది పిల్లల్లో ఎదుగుదల లోపం.. 

రాష్ట్రంలో ఐదేండ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపం తీవ్రంగా ఉంది. స్టంటింగ్ (ఎదుగుదల లోపం).. ఇది వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడాన్ని సూచిస్తుంది. దీర్ఘకాలిక పోషకాహార లోపానికి ఇది ప్రధాన సూచిక. రాష్ట్రంలో స్టంటింగ్ శాతం 35.5% గా ఉంది. అంటే ఐదేండ్లలోపు పిల్లల్లో ప్రతి 100 మందిలో 35.5 మంది వయసుకు తగ్గ ఎత్తు లేరు. ఎదుగుదల లోపంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. 

కొన్ని జిల్లాల్లో ఈ శాతం ఇంకా ఎక్కువగా ఉంది. కొమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో స్టంటింగ్ 35.7 శాతంగా నమోదైంది. ఇక వ్యాస్టింగ్.. ఇది ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడాన్ని సూచిస్తుంది. తెలంగాణలో నేషనల్​ఫ్యామిలీ హెల్త్​సర్వే 5 ప్రకారం వ్యాస్టింగ్ 19.3 శాతంగా ఉంది. అలాగే అండర్‌‌‌‌వెయిట్ 32.1 శాతంగా ఉంది. ఇది స్టంటింగ్, వ్యాస్టింగ్ రెండింటి మిశ్రమ ఫలితంగా వయసుకు తగ్గ బరువు లేకపోవడాన్ని సూచిస్తుంది. ఇక రక్తహీనత అనేది శరీరంలో తగినంత ఎర్ర రక్తకణాలు లేదా హిమోగ్లోబిన్ లేకపోవడం. ఇది పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. రాష్ట్రంలో 6-–59 నెలల వయసు గల పిల్లల్లో రక్తహీనత శాతం చాలా ఎక్కువగా ఉంది. ప్రతి పది మంది పిల్లల్లో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.