జీఎస్ఎల్వీ-ఎఫ్16 సక్సెస్.. భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో మైలురాయి

జీఎస్ఎల్వీ-ఎఫ్16 సక్సెస్.. భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో  మైలురాయి

జీఎస్ఎల్వీ-ఎఫ్ 16 (GSLV-F16) రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. ఈ చారిత్రక ప్రయోగం ద్వారా నిసార్ (NISAR) ఉపగ్రహాన్ని అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ సక్సెస్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శాస్త్రవేత్తల కృషికి నిదర్శమన్నారు. 

 నిసార్ మిషన్‌  విజయవంతం కావడంపై ఇస్రో బృందాన్ని హృదయపూర్వకంగా అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. అంతర్జాతీయ సహకారంతో నాసా-ఇస్రో సంయుక్తంగా చేపట్టిన ఈ ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్ శాస్త్రీయ పురోగతికి నిదర్శనం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  

నిసార్ (NASA-ISRO Synthetic Aperture Radar) ఉపగ్రహం భూమి వాతావరణం, వనరుల పరిశీలన, విపత్తు నిర్వహణ ,శాస్త్రీయ అధ్యయనాలలో కీలక పాత్ర పోషించనుంది. ఈ మిషన్ ఇస్రో ,నాసా మధ్య అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. భారతీయ శాస్త్రవేత్తలు సాధించిన ఈ ఘనత దేశానికి గర్వకారణమని, వారి అంకితభావం యువతకు స్ఫూర్తిదాయకమని సీఎం కొనియాడారు.

ఈ విజయం భారతదేశ అంతరిక్ష పరిశోధనలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శాస్త్రీయ ఆవిష్కరణలలో భారత్‌ను మరింత ముందుకు తీసుకెళ్తుందన్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇతర సహకారులకు సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు