కాంట్రాక్టర్లకు కాసులు.. ఆదివాసీలకు నోటీసులు

కాంట్రాక్టర్లకు కాసులు.. ఆదివాసీలకు నోటీసులు
  •     ఇసుక సొసైటీలపై జీఎస్టీ పిడుగు
  •     పూరిగుడిసెలో బతికే మహిళ3.23 కోట్లు చెల్లించాలని నోటీస్​
  •     పట్టా రైతులకూ పొంచి ఉన్న ప్రమాదం
  •     తప్పించుకుంటున్న రేజింగ్‍ కాంట్రాక్టర్లు

భద్రాచలం, వెలుగు: పట్టా రైతులు, ఆదివాసీ ఇసుక సొసైటీల లీడర్ల నెత్తిన జీఎస్టీ పిడుగు పడుతోంది. వారిని అడ్డుగా పెట్టుకుని ఇసుకను తోడుకుని రేజింగ్‍ కాంట్రాక్టర్లు జేబులు నింపుకొన్నారు. జీఎస్టీ కట్టాలంటూ ఇప్పుడు ఆదివాసీలకు నోటీసులు అందుతున్నాయి. తెలంగాణలోని గోదావరి, దాని ఉపనదులు, వాగులు, వంకలు, పట్టా భూముల్లో ఇసుకను భారీగా తవ్వి అమ్ముకున్నారు. టీఎస్‍ఎండీసీ, మైనింగ్‍, ఐటీడీఏల ఆధ్వర్యంలో ఈ అమ్మకాలు జరిగాయి. కానీ వారెవరూ జీఎస్టీ విషయం పట్టించుకోలేదు. అమ్ముకున్న ఇసుకపై 18 శాతం జీఎస్టీ కట్టాలంటూ ఆ శాఖ ఇప్పుడు నోటీసులు రెడీ చేస్తుండటంతో సొసైటీ కమిటీలు, పట్టా రైతులు బెంబేలెత్తుతున్నారు.  ఐటీడీఏ ఆధ్వర్యంలో నడిచే ఇసుక సొసైటీల్లో అమ్మకాలపై 2శాతం ఇన్‍కం ట్యాక్స్ మినహాయించుకున్నారు. కానీ జీఎస్టీ మాత్రం కట్‍ చేయలేదు. పట్టా భూముల్లో తవ్విన ఇసుకపైనా జీఎస్టీని టీఎస్‍ఎండీసీ విస్మరించింది. ఒప్పందాల్లో మాత్రం జీఎస్టీ కట్టాలంటూ పేర్కొంటున్నా వసూలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎందుకంటే సొసైటీలు, పట్టాభూముల్లో ఇసుక తవ్వింది మొత్తం రేజింగ్​కాంట్రాక్టర్లే. వారిచ్చే ముడుపులకు ఆశపడి వారు వదిలేశారు. పెద్ద పెద్ద అధికార పార్టీ లీడర్లు ఇందులో ఉండటంతో ఆఫీసర్లు కూడా చేతులు ముడుచుకు కూర్చున్నారు. ఆఫీసర్లు, సొమ్ము చేసుకున్న లీడర్లు, రేజింగ్​ కాంట్రాక్టర్లు ప్రస్తుతం బాగానే ఉన్నారు. సొసైటీ ప్రెసిడెంట్, కమిటీ, పట్టా రైతులే బలి అవుతున్నారు. వారి పేరిటే నోటీసులు వస్తున్నాయి. ఏడాది క్రితం ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్టు కో ఆపరేటివ్​సొసైటీ లిమిటెడ్​ప్రెసిడెంట్‍ అయిన ఆదివాసీ మహిళ తల్లడి సమ్మక్కకు జీఎస్టీ నుంచి రూ.3.23 కోట్లు చెల్లించాలని నోటీసు వచ్చింది. దీంతో ఆ ఆదివాసీ మహిళ బిత్తరపోయింది. ఇదే తరహాలో రాష్ట్రంలోని అన్ని సొసైటీలు, పట్టా రైతులకు నోటీసులు రానున్నాయి.

88 లక్షల క్యూబిక్‍ మీటర్ల పైనే..

జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత 2016 తర్వాత గోదావరి పరివాహకంలోని 32 ఇసుక సొసైటీల ద్వారా 88 లక్షల క్యూబిక్‍ మీటర్లకు పైగా ఇసుక అమ్మకాలు జరిగాయి. క్యూబిక్‍ మీటర్‍కు రూ.600 చొప్పున వీటి ద్వారా రూ.528 కోట్ల మేర ఆదాయం వచ్చింది. అయితే సొసైటీకి రూ.220 వస్తే అందులో కాంట్రాక్టర్‍కు రూ.180, రూ.40 సొసైటీకి ఇచ్చారు. కాంట్రాక్టర్లకు రూ.158.40 కోట్లు, సొసైటీలకు రూ.35.20 కోట్ల మేర ఆదాయం వచ్చింది. అయితే 88లక్షల క్యూబిక్‍ మీటర్ల ఇసుక అమ్మకాలపై 18శాతం జీఎస్టీ రూ.95.04 కోట్లు చెల్లించనే లేదు. దీనికి జీఎస్టీ నోటీసులు ఇస్తోంది. సొసైటీలు, పట్టా రైతులే దీనికి బాధ్యులు అవుతారు.

అంతా బడుగు జీవులే

గోదావరి పరివాహక ప్రాంతంలో ఐటీడీఏ ఏర్పాటు చేసిన గిరిజన సొసైటీల్లో అధ్యక్షులు, కమిటీ సభ్యులు అందరూ నురుపేదలే.  రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. నిత్యం కూలీకి వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అలాంటి కమిటీ వారికి జీఎస్టీ నుంచి నోటీసులు రావడం చర్చనీయాంశంగా మారింది. పెద్ద తలకాయలు, లీడర్లు అంతా వీరిని బొమ్మలుగా చూపించి ఇసుకను తోడుకుని అమ్ముకున్నారు. ఇప్పుడు రూ.95 కోట్ల జీఎస్టీని ఈ సొసైటీల నుంచి రికవరీ చేయాల్సి ఉంటుంది. గిరిజన సొసైటీల బిల్లులు అన్నీ ఐటీడీఏలు ఇప్పటికే చెల్లించేశాయి. కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు వారు చెల్లిస్తారా.. లేదా? అనేది తేలాల్సి ఉంది.