జీఎస్టీ, చెక్ క్లియరెన్స్ రూల్స్ మారుతున్నయ్

జీఎస్టీ, చెక్ క్లియరెన్స్ రూల్స్ మారుతున్నయ్

బిజినెస్ డెస్క్, వెలుగు: మరో రెండుమూడు రోజుల్లో అగస్టు ముగుస్తుంది. సెప్టెంబర్ నుంచి  పీఎఫ్, జీఎస్టీ, చెక్ క్లియరెన్సుకు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్పులను తెస్తున్నది. ఆధార్–పాన్‌‌‌‌, ఆధార్‌‌‌‌–యూఏఎన్‌‌‌‌ లింక్‌‌‌‌ తప్పనిసరి అవుతుంది. ఈ కొత్త రూల్స్‌‌‌‌ మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఎకానమీలోనూ మార్పులు తెస్తాయి కాబట్టి వీటి గురించి తప్పక తెలుసుకోవాలి.  
పాజిటివ్ పే సిస్టమ్: చెక్కు ఇస్తే ముందే చెప్పాలి
ఆర్‌‌‌‌బీఐ ఈ ఏడాది జనవరి నుంచే పాజిటివ్ పే సిస్టమ్‌‌‌‌ను అమలు చేస్తోంది. బ్యాంక్ మోసాలను నివారించడానికే ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.  ఇక నుంచి రూ.50,000 కంటే ఎక్కువ విలువైన చెక్కులను జారీ చేసే కస్టమర్లు చెక్కును జారీ చేయడానికి ముందు బ్యాంకులకు తెలియజేయాలి. లేకపోతే ఆ చెక్ బౌన్స్ అవుతుంది. ఇది వరకే చాలా బ్యాంకులు పాజిటివ్‌‌‌‌ పే సిస్టమ్‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చాయి.  యాక్సిస్ బ్యాంక్ వచ్చే నెల నుంచి కొత్త విధానానికి మారుతున్నట్టు ప్రకటించింది. ఈ మార్పు గురించి బ్యాంకులు ఇప్పటికే ఎస్ఎంఎస్ ద్వారా ఖాతాదారులకు తెలియజేస్తున్నాయి.
ఎస్‌బీఐ కస్టమర్లు పాన్-ఆధార్ కార్డ్ లింక్‌ చేయాలి
స్టేట్ బ్యాంక్  ఎకౌంట్ హోల్డర్లందరూ వచ్చేనెలలోపు తమ పాన్ కార్డులను ఆధార్ కార్డులకు లింక్ చేయాలి. లేకపోతే బ్యాంకింగ్ సేవలను పొందడం వీలుకాదు. దీని వలన కొన్ని లావాదేవీలు చేయడమూ సాధ్యం కాదు. ఒక రోజులో రూ. 50,000 లేదా అంతకన్నా ఎక్కువ మొత్తం డిపాజిట్‌‌‌‌ చేయాలంటే పాన్‌‌‌‌కార్డు తప్పనిసరి.  ఆదాయపు పన్ను శాఖ వెబ్‌‌‌‌సైట్ ద్వారా ఆధార్‌‌‌‌తో పాన్‌‌‌‌కార్డును లింక్ చేయాలి. 
జీఎస్టీఆర్-1 ఫైలింగ్ రూల్ మార్పు
జీఎస్టీ నెట్‌‌‌‌వర్క్ (జీఎస్టీఎన్) రూల్స్ సెప్టెంబరు నుండి మారుతున్నాయి. సెంట్రల్ జీఎస్టీ రూల్ -59 (6) ప్రకారం వచ్చే నెల నుంచి జీఎస్టీఆర్--1 దాఖలు విధానం మారుతుంది. గడచిన రెండు నెలలకు సంబంధించిన జీఎస్‌‌‌‌టీఆర్‌‌‌‌-3బీ రిటర్నులను దాఖలు చేయని వ్యాపారులు సెప్టెంబరు  నుంచి జీఎస్‌‌‌‌టీఆర్‌‌‌‌-1లో ఔట్‌‌‌‌వర్డ్‌‌‌‌ సప్లైల వివరాలను నమోదు చేయడానికి వీలుండదు. క్వార్టర్లీ రిటర్నులను సైతం అందించడం సాధ్యపడదు. వీటితో పాటు , యూఏఎన్ను ఆధార్ కార్డ్‌‌‌‌తో ఈపీఎఫ్‌‌‌‌ఓ మెంబర్ల లింక్ చేసుకోవాలి. లేకపోతే వచ్చే నెల నుంచి మీ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలోకి డబ్బు జమ కావు.