జీఎస్టీ ఇన్​కం మస్త్

జీఎస్టీ ఇన్​కం మస్త్
  •    2023-24లో రూ.40,650 కోట్ల ఆదాయం 
  •   2022-23తో పోలిస్తే రూ.4 వేల కోట్లు పెరుగుదల 
  •   పెట్రోల్, లిక్కర్ పై వ్యాట్​తో మరో రూ. 30 వేల కోట్ల రాబడి 

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్ర జీఎస్టీ ఆదాయం గణనీయంగా పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రాబడి రూ.40,650 కోట్లు వచ్చింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే.. జీఎస్టీ ఆదాయం10 శాతం మేరకు పెరిగింది. సాధారణంగా ఎన్నికల ఏడాదిలో ప్రభుత్వ రాబడులు తగ్గుతాయి. అందుకు అనుగుణంగానే పోయిన డిసెంబర్ వరకు జీఎస్టీ ఆదాయం సాధారణ స్థితిలోనే ఉంది. కానీ డిసెంబర్ నుంచి మార్చి వరకు ఆదాయం బాగా పెరిగింది. రాష్ట్ర ఖజానాకు ప్రతి నెలా యావరేజ్ గా రూ. 3.5 వేల కోట్లపైనే జీఎస్టీ రాబడి సమకూరింది. 

మార్చి నెలలో అత్యధికంగా రూ.3,715 కోట్ల ఇన్ కం వచ్చింది. అంతకుముందు ఏడాది మార్చితో పోల్చి చూస్తే.. ఇది11 శాతం ఎక్కువగా ఉన్నది. రాష్ట్రానికి ఆదాయం తెచ్చి పెట్టే ప్రధానమైన శాఖ‌ల్లో వాణిజ్య ప‌న్నుల శాఖ ఒక‌టి. ఈ శాఖ ద్వారా గడిచిన12 నెలల్లో మొత్తంగా రూ.72,157 కోట్ల రాబడి వ‌చ్చింది.   

గండి మార్గాలకు చెక్ పెట్టడం వల్లే.. 

గత ప్రభుత్వ హయాంలో ఆయా శాఖల్లో కమీషన్లకు అలవాటుపడి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్టు గుర్తించిన కొత్త ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నది. దీంతో కమర్షియల్ ట్యాక్స్​విభాగంలో ప్రతి నెలా జీఎస్టీ రాబడుల యావరేజ్ కొత్త ప్రభుత్వం వచ్చిన రెండో నెలకే రూ.150 కోట్లకుపైగా పెరిగింది. మూడో నెలకు రూ.200 కోట్లు, నాలుగో నెల మార్చిలో రూ.379 కోట్లకు ఆదాయం సమకూరింది. మైనింగ్ విషయంలోనూ సర్కార్ జాగ్రత్తలు తీసుకుంటున్నది. జీఎస్టీ రిటర్న్​లలో గోల్ మాల్, ఎక్సైజ్ వ్యాట్ ఇతరవాటిపై పకడ్బందీగా ముందుకు వెళ్తుండటంతో రాష్ట్రానికి రాబడి పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.   

పెట్రోల్, లిక్కర్ వ్యాట్​తో రూ.30 వేల కోట్లు  

2023–24 ఆర్థిక సంవత్సరంలో లిక్కర్, పెట్రోల్ వ్యాట్​పైనా మంచి ఆదాయమే సమకూరింది. అంతకుముందు ఏడాదితో పోల్చిచూస్తే దాదాపు రూ.500 కోట్లు అదనంగా వచ్చింది. ఇందులో లిక్కర్​దే ప్రధాన వాటాగా ఉన్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్​పై రూ.15,415 కోట్ల వ్యాట్ వసూలైంది. అదే సమయంలో లిక్కర్​పై రూ.14,570 కోట్ల వ్యాట్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ రెండింటి మీదే రూ.40 వేల కోట్లపైనే రావచ్చని అంచనాలు ఉన్నాయి.