GST తగ్గింపుతో చిన్న కార్లతో పాటు లగ్జరీ కార్ల రేట్లూ తగ్గుతున్నయ్..!

GST తగ్గింపుతో చిన్న కార్లతో పాటు లగ్జరీ కార్ల రేట్లూ తగ్గుతున్నయ్..!

GST on Cars: భారతదేశంలో కొత్త GST రేషనలైజేషన్ నిర్ణయంతో ఆటో పరిశ్రమ సంతోషంగా ఉంది. యూవీలర్ల నుంచి ఫోర్ వీలర్ల వరకు చిన్న కార్ల నుంచి లగ్జరీ కార్ల వరకూ అన్నింటిపై దీని ప్రభావం ఉండనుంది. గతంలో పెట్రోల్, డీజిల్ కార్ల కొనుగోలుదారులు మెుత్తంగా 50 శాతం వరకు పన్ను చెల్లించాల్సి వచ్చేది. పేరుకు 28 శాతం జీఎస్టీ ఉన్నప్పటికీ దానిపై 22 శాతం కంపెన్సేషన్ సెజ్ కూడా ఉండటంతో కారు రేటులో సగం పన్నులకే వెచ్చించాల్సి వచ్చేది.

కానీ ప్రస్తుతం జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో కేవలం చిన్న కార్లు కొనేవారికి మాత్రమే కాకుండా లగ్జరీ కార్లు కొనాలనుకుంటున్న వారికి సైతం బెనిఫిట్ దక్కనుంది. 2017లో జీఎస్టీని తీసుకొచ్చిన తర్వాత ప్రస్తుతం తీసుకున్న పన్ను తగ్గింపు నిర్ణయంతో మధ్యతరగతి కారు కోరికకు తిరిగి రెక్కలు వస్తున్నాయి. అలాగే ప్రీమియం కార్లపై కూడా పన్ను మెుత్తం మీద తగ్గటాన్ని పరిశ్రమ ఆహ్వానిస్తోంది. 

లగ్జరీ బ్రాండ్స్ Mercedes-Benz, BMW, Jaguar Land Rover, Audi కార్లపై ఇప్పటివరకు ఉన్న 45–50% టోటల్ ట్యాక్స్ (GST+కంపెన్సేషన్ సెస్).. తాజా జీఎస్టీ రేట్ల మార్పులతో 40%కి తగ్గిపోనుంది. కొత్త పన్ను సంస్కరణల్లో కంపెన్సేషన్ సెస్ తొలగింపు లగ్జరీ కార్లపై కూడా రేటు తగ్గింపులకు దారితీస్తోంది. ఆటో నిపుణుల అంచనాల ప్రకారం 5–10 శాతం వరకు మోడళ్లను బట్టి తగ్గుతాయని చెబుతున్నారు.   

ALSO READ : మల్లీప్లెక్సుల్లో పాప్ కార్న్ ధరలు తగ్గాయా.. పెరిగాయా..?

జీఎస్టీ తగ్గింపులతో మహీంద్రా థార్, హ్యూండాయ్ క్రెటా, టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి పెద్ద కార్లకు కూడా ప్రయోజనం దక్కుతోంది. నవరాత్రి మెుదటి రోజు అంటే సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు దేశవ్యాప్తంగా అమలులోకి రాబోతున్నాయి. దీంతో దీపావళి, దసరాకు కార్లు కొనేవారికి తగ్గించబడిన రేట్లతో ఆఫర్లు లాంచ్ చేసేందుకు కార్ డీలర్లు, కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. 

మార్కెట్లో మెుదటిసారిగా లగ్జరీ కారు కొనాలని భావించే వారి నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో లగ్జరీ కార్ల మార్కెట్ షేర్ కేవలం 1% మాత్రమే ఉన్నప్పటికీ.. జీఎస్టీ కొత్త ట్యాక్స్ రేట్ల వల్ల 3%కి పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి.