
2017-–18 నుంచి అమలుచేస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పేద, మధ్య తరగతి ప్రజలను దోపిడీ చేసిందని ఆందోళనపడుతున్న దశలో మోదీ ప్రభుత్వం ఎట్టకేలకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్నది. వైద్య ఆరోగ్య ఉత్పత్తులు సేవలతోపాటు అనేక వినియోగ వస్తువులపై జీఎస్టీని ఈ సెప్టెంబర్ 22 నుంచి తగ్గించడానికి నిర్ణయించింది. జీఎస్టీ రేట్లు తగ్గించడానికి మరో ప్రబలమైన కారణం ట్రంప్ భారతీయ ఎగుమతులపై కక్షపూరితంగా దిగుమతి పన్నులను ఎడాపెడా విధించడం.
మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి జరుగుతున్న టెక్స్టైల్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, జువెలరీస్, వజ్రాలు, ముత్యాలు లాంటి ఎగుమతులపై 50 శాతం దిగుమతి పన్నులను విధించడం వలన ఈ దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితులు దాపురించాయి. 1991లో ఆనాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ప్రకటించిన ప్రపంచీకరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్, బీజేపీ, వామపక్షేతర పార్టీలన్నీ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానం చేయాలని సమర్థించాయి. అయితే, నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టడం ద్వారా అత్యధిక ప్రయోజనం పొందినవారు.. పెట్టుబడుదారులు, కార్పొరేట్ సంస్థలు, వాటికి సహకరించిన నాయకులు. ఈ వాస్తవాన్ని ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల నికర లాభాలను గడిస్తున్నట్లు నిత్యం ఆయా కంపెనీల వార్షిక ఆదాయ ప్రకటనలే తెలియజేస్తున్నాయి.
పేదవర్గాలపై జీఎస్టీ భారం
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారాన్ని మోపిన విషయం మన పాలకులకు తెలియనిది కాదు. గ్లోబలైజేషన్ పుణ్యమా అని అనేక చిన్నతరహా పరిశ్రమలు, కులాధారిత ఉత్పత్తులు నేలకొరిగాయి. కోట్లాదిమంది గ్రామీణ ప్రజల తరతరాల వారసత్వ వృత్తులన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. పేదవర్గాలకు అందాల్సిన సాంఘిక భద్రత పథకాల ప్రయోజనాలు ప్రకటనలకే పరిమితమైంది. కార్పొరేట్ సంస్థల విస్తరణతో గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య మరింత జటిలమైంది.
ప్రజలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయినప్పటికీ మతాలు, కులాల పేరిట ఉచితాలు, ఉత్తుత్తి సామాజిక, సంక్షేమ పథకాల వాసనలతో ఓట్లు లాక్కొని అధికారాన్ని పొందుతూనే ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం విధించిన జీఎస్టీ గత ఏడు, ఎనిమిది సంవత్సరాల నుంచి పేదవర్గాల నడుము విరిచింది. కొవిడ్ మహమ్మారి సందర్భంలో ప్రభుత్వ దవాఖానాలు సరియైన, నాణ్యమైన సేవలు అందించలేదు. విధిలేని పరిస్థితులలో కోట్లాదిమంది కొవిడ్ బాధితులు ఆస్తులను అమ్ముకొని ప్రైవేటు వైద్య సంస్థలకు లక్షల రూపాయలు వెచ్చించి చికిత్స పొందారు. మెరుగైన వైద్య సదుపాయాలు లభించక లక్షలాది మంది ప్రజలు కొవిడ్ మహమ్మారి తాకిడికి ప్రాణాలు కోల్పోయారు. హెల్త్ సేవలు, అనుబంధ ప్రొడక్ట్స్ పై విపరీతమైన స్థాయిలో జీఎస్టీ విధించి ప్రభుత్వం లక్షల కోట్ల సంపద వసూలు చేసి కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చారు. అనేక కార్పొరేట్ వైద్య సంస్థలు, హెల్త్ ప్రొడక్ట్స్, ఫార్మసీ కంపెనీలు కూడా తమవంతు లాభాలను మూటగట్టుకున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్, ఎండోమెంట్ పాలసీలపై 18 శాతం పన్ను విధించడం వలన ఆరోగ్య బీమా పథకాలు అత్యంత ఖరీదు అయినాయి.
దోపిడీని నియంత్రించాలి
అనేక దేశాలలో ఆరోగ్య బీమా దేశ జీడీపీలో 6.8 శాతం వరకు ఉండగా మనదేశంలో కేవలం 3.7% మాత్రమే విస్తరించింది. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకు మరింత ప్రయోజనం చేకూరేవిధంగా మాత్రమే ఈ సంస్కరణ ఉపయోగపడుతుందేమో! ఆరోగ్య బీమా పాలసీదారులకు తాము ప్రకటించిన ప్రయోజనాలకు అనేక చిక్కుముడి షరతులు చూపి అనేక ఇబ్బందులు పెట్టినప్పటికీ అధికార వర్గం పట్టించుకోలేదు. ప్రభుత్వ అధికారులకు కార్పొరేట్ సంస్థలకు ఏర్పడిన క్విడ్ ప్రోకో సంబంధాలు అడ్డువస్తున్నాయి. ఆరోగ్య సంక్షోభ సమయంలో బాధితులు అనేక సందర్భాల్లో మోసానికి గురై కంపెనీలు పెడమొహం పెట్టినప్పుడు సొంత డబ్బులతో చికిత్సలు చేయించుకుంటున్న ఉదంతాలు ఎన్నెన్నో. జీఎస్టీ ప్రభావం వలన సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అందని స్థాయికి చేరింది.
ఉపశమనం కలిగేనా!
హాస్పిటల్ రెంటల్ చార్జెస్, డయాగ్నొస్టిక్ మిషనరీ, ఎక్విప్మెంట్, అనేక రకాల మందులపై 18% జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించడం జరిగింది. జీఎస్టీ తొలగించినప్పటికీ ఆరోగ్య సేవలను పొందే సాధారణ ప్రజలకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు అందుతాయనే నమ్మకం కూడా అంతంతే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు తమ సొంత ప్రయోజనాలకు ఆశపడి ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. హాస్పిటల్స్ యజమానులు,
ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల యజమానులు ప్రజలను దోపిడీ చేస్తుంటే నియంత్రించే అధికారులు చోద్యం చూస్తుంటారు. ఈ దోపిడీని సరైన అధికార యంత్రాంగంతో నియంత్రించ గలిగినప్పుడే ఈ జీఎస్టీ తగ్గించిన ఉపశమనం పేద, మధ్య తరగతి ప్రజలకు అందుతుందని భావించాలి.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో అక్రమ వసూళ్లు
ఇప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అక్రమ వసూళ్లను నియంత్రించ లేకపోతున్నారు. అవినీతిపరులైన అధికారులను ప్రజలు భరిస్తూనే ఉన్నారు. మెడికల్, హెల్త్ సంబంధిత జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలు ప్రజలకు చేరడానికి కావలసిన చైతన్యం ప్రజలలో రావాలి. ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ రేట్లను వస్తువులవారీగా బహిరంగ ప్రకటన చేస్తూ ముఖ్యమైన దవాఖానాల ముందు నోటీసు బోర్డుల ద్వారా నిరంతరం వినియోగదారులను చైతన్యం చేసే కార్యక్రమం చేపట్టాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. లేనిపక్షంలో మన నూతన ఆర్థికవిధానాల ద్వారా అత్యధిక ప్రయోజనాలు బహుళజాతి కంపెనీలకు చేకూరతాయి. సాధారణ ప్రజలకు ప్రయోజనం లభించే అవకాశం అంతంత మాత్రమేనా! కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ తగ్గించడం ద్వారా ఆరోగ్యబీమా పాలసీలను అధికసంఖ్యలో కొనుగోలు చేసే అవకాశం పెరుగుతుంది. కానీ, ఇది కూడా విదేశీ ఆరోగ్య బీమా కంపెనీలకు అత్యధిక ప్రయోజనం చేకూరేది కాకుండా చూడాలి. ప్రజలకు జీఎస్టీ తగ్గింపు వలన ఉపశమనం లభించకుంటే పరోక్షంగా మన పాలకులు విదేశీ కంపెనీలకు లాభాలు చేకూర్చే క్రమంలోనే జీఎస్టీ రేట్లు తగ్గించినవారవుతారు.
- ప్రొ. కూరపాటి వెంకటనారాయణ