
- ఇతర దేశాలపై ఆధారపడితే ముందుకెళ్లలేం
- చిప్స్ నుంచి షిప్స్ దాకా మనమే తయారు చేసుకోవాలి
- రష్యాతో బంధం మరింత బలోపేతం చేసుకుంటున్నామని వెల్లడి
గ్రేటర్ నోయిడా: భవిష్యత్తులో ట్యాక్స్‌లు మరింత కట్ చేస్తామని, ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. జీఎస్టీ సంస్కరణలు కొనసాగుతాయని తెలిపారు. ‘‘మన దేశం ఇప్పుడు జీఎస్టీ బచత్ ఉత్సవ్ జరుపుకుంటున్నది. ఇది ఇంతటితో ఆగిపోదు. మేం 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టినం. 2025లో మొదటిసారి సంస్కరణలు తెచ్చినం.
భవిష్యత్తులోనూ మరిన్ని రిఫామ్స్ తీసుకొస్తాం. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం. ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తాం” అని ఆయన వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో గురువారం ఇంటర్నేషనల్ ట్రేడ్ షో–2025ను ప్రధాని మోదీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘మేం ఇప్పటికే ఇన్‌కమ్ ట్యాక్స్ లిమిట్‌ను రూ.12 లక్షలకు పెంచినం. ఇప్పుడు జీఎస్టీలో సంస్కరణలు తెచ్చినం. వీటి ద్వారా ప్రజలకు ప్రతి ఏటా రూ.2.5 లక్షల కోట్లు ఆదా అవుతాయి” అని తెలిపారు.
ప్రతిపక్షాలది అబద్ధపు ప్రచారం..
సంస్కరణలతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ సులభమవుతుందని మోదీ చెప్పారు. ‘‘పన్ను వివాదాలు తగ్గుతాయి. ఎంఎస్‌ఎంఈలకు త్వరగా రిఫండ్స్ అందుతాయి. జీఎస్టీ రిఫామ్స్‌తో ప్రతి సెక్టార్‌కూ ప్రయోజనం చేకూరుతుంది.
పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఎక్కువగా లబ్ధి జరుగుతుంది” అని తెలిపారు. అయితే, జీఎస్టీ సంస్కరణలపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హయాంలోనే అధిక పన్నుల భారం మోపి, ప్రజలను దోచుకున్నారని విమర్శించారు. ‘‘జీఎస్టీకి ముందు, జీఎస్టీ తర్వాత, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీతో పన్నుల విధానంలో ఎంత మార్పు వచ్చింది.
జీఎస్టీకి ముందు రూ.వెయ్యి షర్ట్ పై రూ.170 ట్యాక్స్ పడేది. జీఎస్టీ వచ్చాక అది రూ.50కి తగ్గింది. ఇప్పుడు రూ.35 అయింది. జీఎస్టీకి ముందు రూ.100 సరుకులు కొంటే బిల్లు రూ.131 అయ్యేది. అంటే రూ.31 పన్నులు పడేవి. అదే జీఎస్టీ వచ్చిన తర్వాత ఆ పన్నులు రూ.18కి తగ్గాయి. ఇప్పుడు రూ.5 మాత్రమే ట్యాక్స్ పడుతున్నది.
అలాగే ఏటా ఒక ఫ్యామిలీ తమ అవసరాల కోసం రూ.లక్ష ఖర్చు పెడితే, జీఎస్టీకి ముందు పన్నుల రూపంలో రూ.20 వేల నుంచి రూ.25 వేలు కట్టాల్సి వచ్చేది. అది ఇప్పుడు రూ.5 వేల నుంచి రూ.6 వేలకు తగ్గింది” అని వివరించారు.
స్వయం సమృద్ధ భారత్ కావాలి..
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ, మన దేశ అభివృద్ధి ఆశాజనకంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ‘‘ఒక దేశం ఇతరులపై ఎంత ఎక్కువగా ఆధారపడితే, ఆ దేశ అభివృద్ధి అంత తక్కువగా ఉంటుంది.
ఇతరులపై ఆధారపడటం కంటే మించిన నిస్సహాయత లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన దేశం స్వయం సమృద్ధి సాధించాలి. ప్రతి వస్తువు దేశంలోనే తయారు కావాలి” అని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. మేక్ ఇన్ ఇండియాపైనే తాము ఎక్కువగా దృష్టిపెట్టామని.. చిప్స్ నుంచి షిప్స్ వరకు మన దేశంలోనే తయారయ్యే విధంగా ఒక ప్రత్యేక విజన్‌తో తాము ముందుకు వెళ్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
రష్యా బంధం కాలపరీక్షను తట్టుకున్నది..
రష్యాతో భారత్ బంధం కాలపరీక్షకు తట్టుకుని నిలబడిందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఈ ట్రేడ్ షోకు భాగస్వామి రష్యా. రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నం” అని తెలిపారు. ‘‘మనం డిఫెన్స్ సెక్టార్‌లో స్వయం సమృద్ధి సాధిస్తున్నాం.
రష్యా సహకారంతో యూపీలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో ఏకే–203 రైఫిళ్ల తయారీ త్వరలోనే ప్రారంభమవుతుంది. బ్రహ్మోస్ మిసైల్స్, ఇతర ఆయుధాల తయారీ ఇప్పటికే మొదలైంది” అని ఆయన చెప్పారు.