కస్టమ్ మిల్లింగ్​పై జీఎస్టీ ఎత్తేయాలి : హరీశ్ రావు

కస్టమ్ మిల్లింగ్​పై జీఎస్టీ ఎత్తేయాలి : హరీశ్ రావు

హైదరాబాద్/ ఖైరతాబాద్, వెలుగు: కస్టమ్ ​మిల్లింగ్, ​మైనర్ ఇరిగేషన్ లాంటి వాటిపై జీఎస్టీ ఎత్తివేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు కోరారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ అధ్యక్షతన శనివారం 48వ జీఎస్టీ కౌన్సిల్​సమావేశం జరిగింది. బీఆర్కే భవన్ ​నుంచి మంత్రి హరీశ్​రావు వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మైనర్ ఇరిగేషన్ మేనేజ్ మెంట్, రిపేర్​వర్క్స్ తో పాటు పేదలకు అందించే సేవలైన ప్రజా పంపిణీ వ్యవస్థ కస్టమ్ మిల్లింగ్, రవాణా సేవలను జీఎస్టీ నుంచి మినహాయించాలని కోరారు. బీడీ ఆకుపై పన్ను వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మారుమూల ప్రాంతాలలోని గిరిజన, పేద మహిళలు బీడీలు తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. కేంద్రం బీడీలపై వేసిన 28 శాతం జీఎస్టీని గతంలో తీవ్రంగా వ్యతిరేకించినట్లు గుర్తుచేశారు. ఇప్పడు బీడీ ముడిసరుకు అయిన ఆకులపై 18 శాతం జీఎస్టీ వేస్తే పేదలు, గిరిజనుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ట్యాక్స్ ఇన్ వాయిస్ రూల్స్ సవరణ ప్రతిపాదనలను హరీశ్‌‌ రావు స్వాగతించారు. అయితే, కొన్ని మార్పులు చేయాలని కోరారు. సమావేశంలో సీఎస్​ సోమేశ్​కుమార్, స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు.

త్వరలోనే నిమ్స్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

నిమ్స్ లో ప్రొఫెసర్ సహా ఖాళీగా ఉన్న ఇతర అన్ని పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి హరీశ్​రావు తెలిపారు. శనివారం నిమ్స్ లోని ట్రామా బ్లాకు లో ఇంట్రా ఆపరేటివ్ అల్ట్రాసౌండ్, ఇంటర్ ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ తదితర పరికరాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు నిత్యవిద్యార్థులని, రోజురోజుకు మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకునేలా వాస్క్యులర్ సర్జరీ సింపోనియం నిర్వహించడం గొప్ప విషయమన్నారు.