
- ఇండియా కూటమి నేతల డిమాండ్
- పార్లమెంట్ ఆవరణలో ఆందోళన
- పాల్గొన్న తెలంగాణ ఎంపీలు
న్యూఢిల్లీ, వెలుగు : హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంపై విధించిన 18 శాతం జీఎస్టీని ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. ‘ట్యాక్స్ టెర్రరిజం’ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, టీఎంసీ, ఆప్, ఎస్పీ తదితర పార్టీల ముఖ్య నేతలు, ఎంపీలు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, మల్లు రవి, రామసహాయం రఘురాంరెడ్డి, చామల కిరణ్ కుమార్, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంపై18 శాతం జీఎస్టీ విధించడం అన్యాయమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పార్లమెంట్లో ఆందోళన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. సామాన్యులపై మరింత భారం మోపేలా కేంద్ర విధానాలు ఉన్నాయని మండిపడ్డారు. ‘‘కేంద్రం అదానీ, అంబానీ కోసమే ఇటీవల బడ్జెట్ పెట్టినట్టుంది. వెంటనే హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై విధించిన 18 శాతం జీఎస్టీని తొలగించాలి” అని వంశీ డిమాండ్ చేశారు. కాగా, ఈ అంశాన్ని లోక్‌సభలో టీఎంసీ ఎంపీలు లేవనెత్తారు. ఇదే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు.