GT vs SRH: ఐపీఎల్ లో ప్లే ఆఫ్ కు చేరిన తొలి జట్టు ఇదే

GT vs SRH: ఐపీఎల్ లో ప్లే ఆఫ్ కు చేరిన తొలి జట్టు ఇదే
  • 34 రన్స్‌‌తో రైజర్స్‌‌పై జీటీ విక్టరీ
  • గిల్​ సెంచరీ,చెలరేగిన షమీ, మోహిత్​ ‌‌

డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ గుజరాత్‌‌ టైటాన్స్‌‌ టాప్‌‌ క్లాస్‌‌ పెర్ఫామెన్స్‌‌ కొనసాగిస్తూ ఐపీఎల్‌‌16లో అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్‌‌కు దూసుకెళ్లింది. లీగ్​లో తొమ్మిదో విక్టరీతో టాప్​2లో ప్లేస్​ ఖాయం చేసుకుంది. మరోవైపు చెత్తాట కొనసాగించిన సన్‌‌ రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ ఎనిమిదో ఓటమితో నాకౌట్‌‌ రేసు నుంచి అధికారికంగా వైదొలిగింది. శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (58 బాల్స్‌‌లో 13 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 101) సూపర్‌‌ సెంచరీకి తోడు షమీ (4/21), మోహిత్‌‌ శర్మ (4/28) పేస్‌‌ పవర్‌‌తో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌లో జీటీ 34 రన్స్‌‌ తేడాతో సన్‌‌ రైజర్స్‌‌ను చిత్తు చేసింది. టాస్‌‌ ఓడిన జీటీ తొలుత 20 ఓవర్లలో 188/9 స్కోరు చేసింది. గిల్‌‌, సాయి సుదర్శన్‌‌ (47) రెండో వికెట్‌‌కు 147 రన్స్‌‌ జోడించారు. భువనేశ్వర్‌‌ (5/30) ఐదు వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్‌‌లో ఓవర్లన్నీ ఆడిన రైజర్స్‌‌ 154/9 మాత్రమే చేసి ఓడింది. హెన్రిచ్‌‌ క్లాసెన్‌‌ (44 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 64) ఒంటరి పోరాటం చేశాడు.  గిల్‌‌కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది.

గిల్‌‌ ధనాధన్‌‌.. భువీ పాంచ్​

గుజరాత్‌‌ ఇన్నింగ్స్‌‌లో గిల్‌‌ ఆటే హైలైట్‌‌. అతనికి మరో యంగ్‌‌స్టర్‌‌ సాయి సుదర్శన్‌‌ మంచి సపోర్ట్ ఇచ్చాడు. స్టార్టింగ్‌‌, ఎండింగ్‌‌లో భువనేశ్వర్‌‌ సూపర్‌‌ బౌలింగ్‌‌తో సత్తా చాటినా.. గిల్‌‌ ఖతర్నాక్‌‌ బ్యాటింగ్‌‌తో జీటీ మంచి స్కోరు చేసింది. ఇన్నింగ్స్‌‌ మూడో బాల్‌‌కే మంచి ఔట్‌‌ స్వింగర్‌‌తో ఓపెనర్‌‌ సాహా (0)ను డకౌట్‌‌ చేసిన భువీ హోమ్‌‌టీమ్‌‌కు షాకిచ్చాడు. కానీ, రైజర్స్‌‌కు మరో అవకాశం ఇవ్వని గిల్‌‌.. సుదర్శన్‌‌తో అద్భుత పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ నెలకొల్పాడు. భువీ బౌలింగ్‌‌లో సాయి రెండు ఫోర్లు కొట్టగా.. ఫరూఖీ వేసిన నాలుగో ఓవర్లో గిల్‌‌ వరుసగా నాలుగు బౌండ్రీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. వీరిని విడదీసేందుకు బౌలర్లను మార్చినా.. కెప్టెన్‌‌ మార్‌‌క్రమ్‌‌ స్వయంగా బౌలింగ్‌‌కు వచ్చినా ఫలితం లేకపోయింది. నాణ్యమైన డ్రైవ్స్‌‌, పుల్‌‌, కట్‌‌ షాట్లతో వరుస బౌండ్రీలు కొట్టిన గిల్‌‌ 22 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. సగం ఓవర్లకే జీటీ స్కోరు వంద దాటింది. చివరకు 15వ ఓవర్లో సుదర్శన్‌‌ను ఔట్‌‌ చేసిన జాన్సెన్‌‌ ఈ జోడీని విడదీయగా.. స్లాగ్‌‌ ఓవర్లలో జీటీ తడబడింది. భువీ బౌలింగ్‌‌లో హార్దిక్‌‌ (8)..త్రిపాఠికి క్యాచ్‌‌ ఇవ్వగా.. మిల్లర్‌‌ (7), తెవాటియా (3)  ఫెయిలయ్యారు.  నట్టూ వేసిన 19వ ఓవర్లో సింగిల్‌‌ తీసిన గిల్​ ఐపీఎల్‌‌లో తొలి సెంచరీ (56 బాల్స్‌‌)లో పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్లో భువీ  తొలి రెండు బాల్స్‌‌కు గిల్‌‌, రషీద్‌‌ (0)ను ఔట్ చేయగా.. మూడో బాల్‌‌కు నూర్‌‌ అహ్మద్‌‌ (0) రనౌటయ్యాడు. ఐదో బాల్‌‌కు షమీ (0)ని ఔట్‌‌ చేసిన భువీ ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 

రైజర్స్ చెత్తాట

టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో బ్యాటర్లంతా పెవిలియన్‌‌కు క్యూ కట్టడంతో సన్‌‌ రైజర్స్‌‌ ఏ దశలోనూ టైటాన్స్‌‌కు పోటీ ఇవ్వలేకపోయింది.  షమీ దెబ్బకు టాపార్డర్‌‌ కుదేలవగా.. మోహిత్‌‌ శర్మ   మిడిలార్డర్‌‌ పనిపట్టాడు. ఇన్నింగ్స్‌‌ ఐదో బాల్‌‌కే అన్మోల్‌‌ ప్రీత్‌‌ (5)ను ఔట్‌‌ చేసిన షమీ సన్‌‌రైజర్స్‌‌ పతానాన్ని ఆరంభించాడు. మరుసటి ఓవర్లో మరో ఓపెనర్‌‌ అభిషేక్‌‌ (5)ను యశ్‌‌ దయాల్‌‌ వెనక్కు పంపగాడు. ఆపై, రెండు ఓవర్లలో  రాహుల్‌‌ త్రిపాఠి (1), కెప్టెన్‌‌ మార్‌‌క్రమ్‌‌ (10)ను షమీ పెవిలియన్‌‌ చేర్చడంతో 29/4తో రైజర్స్‌‌ ఎదురీత మొదలు పెట్టింది. పవర్‌‌ ప్లే తర్వాత బౌలింగ్‌‌కు వచ్చిన మోహిత్‌‌ నాలుగు బాల్స్‌‌ తేడాతో సన్వీర్‌‌ సింగ్‌‌ (7), సమద్‌‌ (4)ను ఔట్‌‌ చేసి డబుల్‌‌ స్ట్రోక్‌‌ ఇచ్చాడు. తొమ్మిదో ఓవర్లో జాన్సెన్‌‌ (2)ను కూడా వెనక్కుపంపడంతో 59/7తో నిలిచిన రైజర్స్‌‌ ఇన్నింగ్స్‌‌ ఎంతోసేపు నిలువదనిపించింది. అయితే, అప్పటికే క్రీజులో కుదురుకున్న క్లాసెన్‌‌ ఒంటరి పోరాటం చేశాడు. భువనేశ్వర్‌‌  ( 27)తో ఎనిమిదో వికెట్‌‌కు 68 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ చేసి 17వ ఓవర్లో షమీ బౌలింగ్‌‌లో ఔటయ్యాడు.   చివర్లో భువీతో పాటు మయాంక్‌‌ మార్కండే(18 నాటౌట్‌‌)  పోరాటంతో రైజర్స్ 150  దాటి భారీ ఓటమి తప్పించుకుంది.

సంక్షిప్త స్కోర్లు

గుజరాత్‌‌: 20 ఓవర్లలో 188/9 (గిల్‌‌ 101, సుదర్శన్ 47, భువనేశ్వర్‌‌ 5/30).
హైదరాబాద్‌‌: 20 ఓవర్లలో 154/9 (క్లాసెన్‌‌ 64, షమీ 4/21, మోహిత్‌‌ 4/28).