భద్రాచలం, వెలుగు : భద్రాచలం కేంద్రంగా గోదావరిపై జీటీఎస్(గ్రేట్ ట్రిగ్నోమెట్రికల్ సర్వే) మొదలైంది. ఈ సర్వే కోసం రెండు టీంలను నియమించగా.. ఒకటి భద్రాచలం నుంచి ఏపీలోని విలీన గ్రామమైన కూనవరం వరకు, రెండోది భద్రాచలం నుంచి చత్తీస్‌గఢ్‌లోని సుక్మా వరకు సర్వే నిర్వహించనున్నాయి.
రాజమండ్రి సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) నుంచి వచ్చిన టీం భద్రాచలం నుంచి కూనవరం వరకు సర్వే ప్రారంభించింది. ప్రతీ ఐదేండ్లకోసారి ఈ సర్వేను నిర్వహిస్తుంటారు. భద్రాచలంలోని హరిత హోటల్ వెనుక భాగంలో సర్వే ఆఫ్ ఇండియా పాతిన రాయి ఒకటి ఉంది. దీని ఆధారంగానే గోదావరి నీటిమట్టాన్ని లెక్కిస్తుంటారు.
వరదల టైంలో కూనవరంలో ఉన్న సీడబ్ల్యుసీ కేంద్రం గోదావరి నీటిమట్టాన్ని ప్రకటిస్తోంది. ఇందులో ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా అనేది ఈ జీటీఎస్ నిర్ధారిస్తుంది. ఈ సర్వే నిర్ధారించిన లెక్కల ప్రకారమే మరో ఐదేండ్ల పాటు గోదావరి నీటిమట్టాలను సీడబ్ల్యుసీ పరిగణనలోకి తీసుకోనుంది. దీని ప్రకారమే తీర ప్రాంత ప్రజలను అలర్ట్చేస్తుంటారు. ప్రస్తుతం భద్రాచలం నుంచి కూనవరం వరకు సర్వే జరుగుతుండగా, వచ్చే నెలలో భద్రాచలం నుంచి సుక్మా వరకు సర్వే నిర్వహించనున్నారు.
