మంచిర్యాల/దండేపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గోదావరి వరదల్లో మునగడంతో భారీ నష్టం జరిగింది. నీటిని లిఫ్ట్ చేసే మోటార్లు, టర్బైన్లు, హెచ్‌టీ ప్యానల్, ఎలక్ట్రికల్ ప్యానల్, ఎల్టీ ప్యానల్, జనరేటర్, బ్యాటరీ బ్యాంక్, ఎయిర్ కంప్రెషర్, ఎలక్ర్టో మెకానికల్, హైడ్రో మెకానికల్ సామాగ్రి బురదలో కూరుకుపోయాయి. యంత్రాలన్నీ మూడు రోజులపాటు నీటిలోనే మునిగి ఉన్నాయి. 4.2 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేసే రెండు పంపులు కూడా మునగడంతో భారీ నష్టం మిగిలింది. ఈ యంత్రాలన్నీ ఢిల్లీతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ మెషీన్ల రిపేర్లకు మూడు నాలుగు నెలలు పట్టవచ్చని సమాచారం. 15 ఏండ్ల పాటు ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్కీమ్ను నిర్వహించే బాధ్యతలను మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ లిమిటెడ్‌కు అప్పగించారు. యంత్రాలు నీట మునిగిన సమాచారం ఆ కంపెనీకి అందించినట్టు అధికారులు తెలిపారు.
ఆయకట్టుకు నీరందేనా...?
కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టును స్థిరీకరించేందుకు గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను ఏర్పాటు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి లక్సెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్ మండలాల్లోని 30 వేల ఎకరాలకు 3 టీఎంసీల నీటిని అందించాలన్నది ఈ స్కీమ్ లక్ష్యం. కానీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించిన దాఖలాలు లేవు. ప్లాంట్‌ను గోదావరి మట్టానికి 150 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. ఇటీవల 154 మీటర్ల ఎత్తులో వరద రావడంతో పంపులు, యంత్రాలు మునిగిపోయాయి. మరోవైపు కడెం ప్రాజెక్టు గేట్లలో చెత్త చిక్కుకొని గేట్లు కిందికి దిగడం లేదు. ప్రాజెక్టు మొత్తం ఖాళీ అవుతోంది. దీంతో ఈసారి ఆయకట్టు భూములకు గూడెం లిఫ్ట్ నుంచి, అటు కడెం ప్రాజెక్టు నుంచి సాగునీరు అందడం అనుమానమేనని అంటున్నారు.
