స్పా సెంటర్లకు అద్దెలకు ఇవ్వొద్దు.. ఉంటే ఖాళీ చేయించండి : పోలీసులు

స్పా సెంటర్లకు అద్దెలకు ఇవ్వొద్దు.. ఉంటే ఖాళీ చేయించండి : పోలీసులు

మీ ఇంటిని లేదా మీ స్థలాన్ని లేదా మీ ఆస్తిని స్పా సెంటర్ కు అద్దెకు ఇస్తున్నారా.. స్పా సెంటర్ కు లీజుకు ఇస్తున్నారా.. ఇక నుంచి అలా ఇవ్వొద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే స్పా సెంటర్ కు అద్దె లేదా లీజుకు ఇచ్చినట్లయితే వెంటనే ఖాళీ చేయించాలని సూచిస్తున్నారు హైదరాబాద్ సిటీ గుడిమల్కాపూర్ ఇన్ స్పెక్టర్ మజీజ్ రెహ్మాన్ పిలుపునిచ్చారు. జనవరి 5వ తేదీ రాత్రి గుడిమల్కాపూర్ ఏరియాలోని నానల్ నగర్ లోని స్పా సెంటర్లపై దాడులు చేశారు. 

సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ తో కలిసి జాయింట్ ఆపరేషన్ చేయగా.. రెండు స్పా సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం ఐదుగురు మహిళలు, ఓ మగాడిని అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్ల యజమానులపై కేసులు పెట్టారు. స్పా సెంటర్లకు అద్దెలకు ఇవ్వొద్దని.. ఒక వేళ ఇప్పటికే అద్దెలకు ఇచ్చినట్లయితే వాటిని వెంటనే ఖాళీ చేయించాలని.. ఆయా భవన యజమానులకు సూచించారు పోలీస్ అధికారులు రెహ్మాన్. 

స్పా సెంటర్లు, స్నూకర్ సెంటర్లు, రిక్రియేషన్ క్లబ్బులకు ఇళ్లను, కమర్షియల్ స్పేస్ లను అద్దెలకు ఇవ్వొద్దని కోరారు. ఇలాంటి వాటి వల్ల యువత చెడిపోతుందని.. తప్పుడు మార్గాల్లోకి వెళుతున్నారని స్పష్టం చేశారాయన. సామాజిక బాధ్యతగా భవన యజమానులు కూడా స్పా, స్నూకర్, రిక్రియేషన్ వంటి వాటిని అద్దెలకు ఇచ్చేటప్పుడు ఆలోచించాలని కోరారు. ఇలాంటి సెంటర్లకు వెళ్లి యువత.. పోలీస్ కేసుల్లో ఇరుక్కోవద్దని సలహా ఇచ్చారు గుడిమల్కాపూర్ ఇన్ స్పెక్టర్ రెహ్మాన్.