
గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్ కేంద్రంగా గుడుంబా అమ్మేందుకు ప్రయత్నిస్తున్న భార్యాభర్తలను శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన ప్రకారం.. నానక్రామ్గూడలో నివాసముండే బజార్ వాలె కిషన్ సింగ్, రేఖ భాయి దంపతులు ధూల్ పేటకి చెందిన రాధిక భాయి, శంకర్ నుంచి రూ.400కు లీటర్ చొప్పున 10 లీటర్ల నాటుసారా కొన్నారు. నానక్రామ్గూడలో ఓ కూలీకి రూ.60 లకు 90 ఎంఎల్ చొప్పున అమ్ముతుండగా గురువారం శంషాబాద్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 10 లీటర్ల నాటుసారా, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.