బోరు బావిలో పడ్డ 3ఏళ్ల చిన్నారి.. సేఫ్ గా వచ్చింది.. కానీ అంతలోనే

బోరు బావిలో పడ్డ 3ఏళ్ల చిన్నారి.. సేఫ్ గా వచ్చింది.. కానీ అంతలోనే

గుజరాత్‌లోని ద్వారకా జిల్లాలో జనవరి 1న ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. బోర్‌వెల్‌లో ఏంజెల్ సఖ్రా అనే మూడేళ్ల బాలిక అకస్మాత్తుగా పడిపోయింది. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు.. ఎట్టకేలకు ఆ చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. ఓ గంట తర్వాత ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. ఈ ఇంటెన్సివ్ ఆపరేషన్ ఎనిమిది గంటలపాటు జరిగిందని, ఆ తర్వాత ఆమెను ఖంభాలియా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

ఆర్‌ఎంఓ భారతి తెలిపిన వివరాల ప్రకారం.. ఆక్సిజన్ అందక పోవడంతో ఊపిరి సరిగా ఆడలేదని, అదే చిన్నారి మృతికి కారణమని నిర్ధారించారు. పోస్ట్‌మార్టం పరీక్ష పూర్తయిందని, ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరణానికి తుది కారణం వెల్లడిస్తామని చెప్పారు. అంతకుముందు, రాత్రి 9:48 గంటలకు, పలు ఏజెన్సీలతో కూడిన బృందం చిన్నారిని రక్షించి, అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి పంపింది. భారత సైన్యం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సహాయక చర్యల్లో పాల్గొన్న ఈ ఆపరేషన్‌లో ద్వారకా జిల్లా కలెక్టర్ అశోక్ శర్మ సహా సీనియర్ అధికారులు కూడా ఉన్నారు.

సోమవారం (జనవరి 1) మధ్యాహ్నం 1:00 గంటల సమయంలో జిల్లాలోని రాన్ గ్రామంలోని తన ఇంటి ముందు పెరట్లో చిన్నారి ఆడుకుంటుండగా ఓపెన్ బోర్‌వెల్‌లోకి జారిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.