పాక్‌ నుంచి దొంగచాటుగా దేశంలోకి.. రూ.480 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

పాక్‌ నుంచి దొంగచాటుగా దేశంలోకి.. రూ.480 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

దేశంలో మరోసారి పెద్ద ఎత్తున డ్రగ్స్ కలకలం రేపాయి. 2024 మార్చి 11, 12 తేదీలలో రాత్రిపూట గుజరాత్ తీరంలో భారత తీర రక్షక దళం(ICG) నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో రూ. 480 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు పాకిస్థానీలను అదుపులోకి తీసుకున్నారు. 

సముద్రంలో దొంగచాటుగా.. 

మార్చి 11, 12 తేదీలలో రాత్రి సమయంలో ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఇండియన్ కోస్ట్ గార్డ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి), గుజరాత్‌కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) జాయింట్ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో ICG నౌకలు పోర్‌బందర్ నుండి సుమారు 350 కి.మీ దూరంలో ఉన్న అరేబియా సముద్ర తీరాన ఓ అనుమానాస్పద బోటు తచ్చాడుతున్నట్లు గుర్తించారు. వెంటనే ఆ బోటును చుట్టిముట్టి తనిఖీలు చేయగా.. భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. 

బోట్‌లో సుమారు 80 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.480 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. బోట్‌ను స్వాధీనం చేసుకొని, అందులో ఉన్న ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని తదుపరి విచారణ కోసం పోర్‌బందర్‌ తరలించారు.

గత మూడేళ్లలో ఏటీఎస్‌ గుజరాత్‌, ఎన్‌సీబీ సహకారంతో (ఇండియన్ కోస్ట్ గార్డ్) ఐసీజీ చేసిన పదో విజయవంతమైన ఆపరేషన్ ఇది. ఇప్పటివరకూ రూ.3135 కోట్ల విలువైన 517 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.