గుజరాత్ ఏటీఎస్ అదుపులో తీస్తా సెతల్వాడ్

గుజరాత్ ఏటీఎస్ అదుపులో తీస్తా సెతల్వాడ్

సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్ ను గుజరాత్ కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) శనివారం ముంబైలోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకుంది. అక్కడి నుంచి ఆమెను  ప్రత్యేక వాహనంలో అహ్మదాబాద్ కు తరలించారు. స్వచ్ఛంద సంస్థకు విదేశీ నిధులను సమీకరించిన కేసులో విచారించేందుకే సెతల్వాడ్ ను ఏటీఎస్ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఏటీఎస్ బృందం సెతల్వాడ్ ఇంట్లోకి శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా దూసుకొచ్చి, కొట్టి అదుపులోకి తీసుకున్నారని ఆమె తరఫు న్యాయవాది ఆరోపించారు. 2002 గుజరాత్ అల్లర్లలో ధ్వంసమైన గుల్బర్గా  సొసైటీ బాధితుల స్మారకార్ధం  మ్యూజియం ఏర్పాటు చేస్తానంటూ సేకరించిన నిధులను తీస్తా సెతల్వాడ్.. సొంత అవసరాలకు వాడుకున్నారనే అభియోగాలతో ఆమెపై గతంలో  ఓ కేసు నమోదైంది. ప్రస్తుత దర్యాపు కూడా దానితో ముడిపడినదేనని అంటున్నారు.  

గుజరాత్ అల్లర్లపై నిరాధార సమాచారమిచ్చారు : అమిత్ షా

కాగా, శనివారం ఉదయం ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై తీస్తా సెతల్వాడ్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ పోలీసులకు ఆనాడు నిరాధారమైన సమాచారాన్ని అందించిందని ఆయన మండిపడ్డారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ప్రధానమంత్రి  నరేంద్ర మోడీకి ఇచ్చిన క్లీన్ చిట్ ను సమర్ధిస్తూ సుప్రీం కోర్టు  జూన్ 24న (శుక్రవారం) తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.