- సందర్శించిన గుజరాత్ సీఎం, మినిస్టర్స్
హైదరాబాద్, వెలుగు: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా గుజరాత్ లోని బరోడాలో గల హేక్తనగర్‌లో ఉన్న 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' వద్ద కేంద్ర పర్యాటక శాఖ ‘భారత్ పర్వ్’, ‘ఏకతా ప్రకాశ్ పర్వ్’ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో తెలంగాణ తరఫున పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా గుజరాత్ సీఎం ఉపేంద్ర బాయ్ పటేల్, మినిస్టర్స్, హర్యానా గవర్నర్ తదితరులు స్టాళ్లను సందర్శించారు. తెలంగాణ నుంచి “గో కుల్ చాట్” పేరుతో ఫుడ్ పావిలియన్ లో ఆహార స్టాల్, సాంస్కృతిక హస్తకళల విభాగంలో చేర్యాల చిత్రకళ స్టాల్, హ్యాండ్‌లూమ్స్ విభాగంలో పోచంపల్లి వస్త్రాల స్టాల్ ఏర్పాటు చేశారు.
తెలంగాణ సంప్రదాయ వంటకాలు వెజిటేబుల్ బిర్యానీ, నిమ్మరసం అన్నం, సర్వపిండి, పచ్చిపులుసు, గోంగూర పచ్చడి, కురబానికి మీఠా, టమాటా చట్నీ మొదలైన వంటకాలను సిద్ధం చేసి, ఇక్కడికి వచ్చిన ప్రజలకు ఉచితంగా రుచిచూపిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణకు చెందిన యామినీ రెడ్డి కూచిపూడి నృత్యం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ గుస్సాడీ బృందం వారి జానపద నృత్య ప్రదర్శనలను నిర్వహించారు. తెలంగాణ పర్యాటకశాఖ తరఫున డాక్టర్ కుసుమ సూర్యకిరణ్ (అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్), చేర్యాల పెయింటింగ్స్ తరఫున అంశిత, పోచంపల్లి స్టాల్ తరఫున బాలసుబ్రహ్మణ్యం,“గో గుల్ చాట్” తరఫున ప్రతినిధులు పాల్గొన్నారు.
