గుజరాత్ ఎన్నికల కోసం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా

గుజరాత్ ఎన్నికల కోసం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా

గుజరాత్ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ జాబితాలో పార్టీ అధినేత మల్లిఖార్జున్ ఖర్గే, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సీఎంలు అశోక్ గెహ్లాట్-భూపేశ్ బాఘేల్, సచిన్ పైలట్, జిగ్నేష్ మేవానీ, కన్హయ్య కుమార్ ఉన్నారు. వీరు పార్టీ కోసం గుజరాత్‭లో ప్రచారం చేయనున్నారు. తమ పార్టీ గుజరాత్‭లో అధికారంలోకి వస్తే.. తాము ప్రజలకు ఏం చేస్తారనే దాని పై ఎన్నికల ప్రచారంలో వివరించనున్నారు. తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేరుస్తామని ప్రజలకు తెలియజేయనున్నారు. 

ప్రభుత్వ, సెమీ గవర్నమెంట్‌ విభాగాల్లో 10 లక్షల ఉద్యోగాలు, రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, రూ.500కి ఎల్‌పిజి సిలిండర్‌,300 యూనిట్లు కరెంటు వంటి కీలక వాగ్దానాలతో.. ప్రజల ముందకు వెళ్లనున్నారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‭లో... బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేయనున్నారు. అలాగే.. ఉద్యోగం లేని యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి, దివ్యాంగులు, వితంతువులు, సీనియర్ సిటిజన్లు, నిరుపేద మహిళలకు రూ.2వేల పెన్షన్, మత్స్యకారులకు రూ.3 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో తెలిపింది. 

ముఖ్యంగా 2002 బిల్కిస్ బానో కేసులో దోషులుగా ఉన్న 11 మందిని జైలు నుంచి ముందస్తుగా విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఉపశమనాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే... అహ్మదాబాద్‌లోని మోటేరా ప్రాంతంలోని నరేంద్ర మోడీ స్టేడియం పేరును సర్దార్ పటేల్ స్టేడియంగా పునరుద్ధరిస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.