గుజరాత్లో ఘోర ప్రమాదం.. బ్రిడ్జి కూలడంతో నదిలో పడి కొట్టుకుపోయారు

గుజరాత్లో ఘోర ప్రమాదం.. బ్రిడ్జి కూలడంతో నదిలో పడి కొట్టుకుపోయారు

గుజరాత్ లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. మహిసాగర్ నదిపై ఉన్న గంభీరా బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోవడంతో ప్రమాదం జరిగింది. బ్రిడ్జి రెండుగా చీలిపోవడంతో బ్రిడ్జిపైనుంచి వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా నదిలోకి పడిపోయాయి. బ్రిడ్జి కూలిపోయిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో బ్రిడ్జి కూలిపోవడం చర్చనీయాంశంగా మారింది. 

బుధవారం (జులై 09) మహిసాగర్ నదిపై ఉన్న గంభీరా  బ్రిడ్జి ఒక్కసారిగా కూలి నదిలోకి పడిపోయింది. దీంతో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న నాలుగు వాహనాలు నదిలో పడిపోయాయి. పద్రా తాలూకా ముజ్ పూర్ గ్రామ సమీపంలో మహిసాగర్ నదిపై ఉన్న బ్రిడ్జిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

  గుజరాత్ లోని ఆనంద్, వడోదర జిల్లాలను కలిపే బ్రిడ్జి కూలిపోవడంతో పరిస్థితులు ఆందోళన కరంగా మారాయి. రెండు ట్రక్కులు, ఒక బొలెరో SUV, ఒక పికప్ వ్యాన్ కలిపి.. నాలుగు వాహనాలు నదిలో పడిపోవడంతో ముగ్గురు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అదే విధంగా 5 మందిని రెస్క్యూ టీమ్స్ కాపాడాయి. మరికొంత మంది గల్లంతయ్యారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టాయి NDRF రక్షణ బలగాలు .  

గుజరాత్, సౌరాష్ట్ర మధ్య గత 40 ఏళ్లుగా రవాణా సేవలకు ఆధారమైన బ్రిడ్జి కూలిపోవడం తీవ్ర నష్టంగా స్థానికులు చెబుతున్నారు.  మహిసాగర్ నదిపై 832 మీటర్ల పొడవు, 7.5 మీటర్ల వెడల్పులో బ్రిడ్జిని నిర్మించారు. 1981లో ప్రారంభమైన నిర్మాణం..1986లో పూర్తయ్యింది. బ్రిడ్జికి ఇరువైపులా మీటరునర ఫుట్ పాత్ లు ఏర్పాటు చేశారు. అప్పట్లోనే ఈ బ్రిడ్జిని రూ.3.16 కోట్లతో  నిర్మించారు. 

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం..?

చాలా కాలంగా గంభీరా బ్రిడ్జి మరమ్మత్తులతో నడుస్తున్నట్లు చెబుతున్నారు. ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉండవచ్చుననే ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు ఇంజినీర్లు. కానీ ప్రభుత్వం కొత్త బ్రిడ్జిపై దృష్టిపెట్టకపోవడం తో ఈ ప్రమాదం జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. అయితే కొత్త బ్రిడ్జి నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చామని.. అంతలోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది.