రాజస్తాన్‌‌పై గ్రాండ్‌‌ విక్టరీ

రాజస్తాన్‌‌పై గ్రాండ్‌‌ విక్టరీ

కోల్‌‌కతా: లీగ్ దశలో సత్తాచాటి ఈ సీజన్‌‌లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచిన కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్–1 మ్యాచ్‌‌లోనూ అదరగొట్టింది. మంగళవారం రాజస్తాన్ రాయల్స్‌‌తో జరిగిన ఈ మ్యాచ్‌‌లో 7 వికెట్ల తేడాతో విక్టరీ సాధించి ఫైనల్​కు చేరింది. జాస్ బట్లర్ (56 బాల్స్‌‌లో 12 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 89)తో పాటు కెప్టెన్ సంజూ శాంసన్ (26 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 47) రెచ్చిపోవడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 188/6 భారీ స్కోరు చేసింది. గుజరాత్ బౌలర్లలో హార్దిక్ (1/14), సాయి కిశోర్ (1/43), షమీ (1/43), యశ్ దయాల్ (1/46) తలా ఓ వికెట్ తీశారు. అనంతరం ఛేజింగ్‌‌లో 19.3 ఓవర్లలో 191/3 స్కోరు చేసిన గుజరాత్ విక్టరీ అందుకుంది. డేవిడ్ మిల్లర్ (38 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 5 సిక్స్ లతో 68 నాటౌట్) హాఫ్ సెంచరీతో అలరించగా, హార్దిక్ పాండ్యా (27 బాల్స్‌‌లో 5 ఫోర్లతో 40 నాటౌట్) రాణించాడు. రాజస్తాన్ బౌలర్లలో బౌల్ట్ (1/38), ఒబెద్ మెకే (1/40) ఆకట్టుకున్నారు. మిల్లర్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

బట్లర్ బాదుడు..
మొదట బ్యాటింగ్​లో రాజస్తాన్‌‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. రెండో ఓవర్లోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (3) వికెట్ కోల్పోయిన ఆర్ఆర్‌‌ను బట్లర్, సంజూ శాంసన్ రెండో వికెట్​కు 68 రన్స్ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌తో ఆదుకున్నారు. క్రీజులో ఉన్నంతసేపు శాంసన్ బౌండ్రీలతో విరుచుకుపడగా.. బట్లర్ అతడికి సపోర్ట్ ఇచ్చాడు. అయితే 10వ ఓవర్లో దూకుడు మీదున్న శాంసన్‌‌ను ఔట్ చేసిన సాయి కిశోర్ టైటాన్స్‌‌కు బ్రేక్ ఇచ్చాడు. అప్పటికి 79/2తో నిలిచిన రాయల్స్ బ్యాటింగ్ చూస్తే 150 దాటడం కష్టంగా అనిపించింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ (28) మొదట నెమ్మదిగా ఆడినా 14వ ఓవర్లో 6,4,4తో స్కోరులో వేగం పెంచాడు. కానీ తర్వాతి ఓవర్లోనే అతడు ఔటయ్యాడు. ఈ సమయంలో బట్లర్ తనలోని హిట్టర్‌‌ను బయటకు తీశాడు. అప్పటివరకు 38 బాల్స్ లో 39 రన్స్ చేసిన అతడు ఒక్కసారిగా రెచ్చిపోయి తర్వాతి 18 బంతుల్లో 50 రన్స్‌‌తో విశ్వరూపం చూపించాడు. 17వ ఓవర్లో నాలుగు ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకుని.. 18వ ఓవర్లో మూడు ఫోర్లతో పాటు తర్వాతి ఓవర్లో 4,6 బాదాడు. ఇక చివరి ఓవర్లో బట్లర్‌‌తో పాటు రియాన్ పరాగ్ (4) రనౌట్‌‌గా వెనుదిరిగినా అప్పటికే రాజస్తాన్ భారీ స్కోరు చేసింది. 

ఇద్దరూ.. ఇద్దరే
భారీ టార్గెట్​ను గుజరాత్ అలవోకగా ఛేదించింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే సాహా (0)ను బౌల్ట్ ఔట్ చేసినా.. శుభ్‌‌మన్ గిల్ (35), మాథ్యూ వేడ్ (35) రెండో వికెట్‌‌కు 72 రన్స్ భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌‌ను ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలో 64/1తో నిలిచిన గుజరాత్ పటిష్ట స్థితిలో కనిపించింది. ఆపై వెంటవెంటనే వీరిద్దరూ ఔటైనా మిల్లర్, పాండ్యా సమయోచితంగా ఆడారు. దీంతో 16 ఓవర్లలో 146/3 స్కోరు చేసిన గుజరాత్‌‌ విక్టరీకి చివరి 24 బాల్స్‌‌లో 43 రన్స్ అవసరమయ్యాయి. తర్వాతి రెండు ఓవర్లలో 20 రన్స్ రావడంతో విజయ సమీకరణం 12 బాల్స్‌‌లో 23 రన్స్‌‌గా మారింది. ఇక 19వ ఓవర్లో ఫోర్‌‌తో పాటు సింగిల్‌‌తో మిల్లర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా ఈ ఓవర్లో కేవలం ఏడు రన్సే రావడంతో మ్యాచ్ ఉత్కంఠకు దారితీసింది. ఆరు బాల్స్‌‌లో 16 రన్స్ అవసరం కాగా..  ప్రసీధ్‌‌ బౌలింగ్‌‌లో మిల్లర్ వరుసగా మూడు సిక్సర్లతో టైటాన్స్‌‌కు విక్టరీ అందించాడు.
సంక్షిప్త స్కోర్లు
రాజస్తాన్: 20 ఓవర్లలో 188/6 (బట్లర్ 89, హార్దిక్ 1/14). గుజరాత్: 19.3 ఓవర్లలో 191/3 (మిల్లర్ 68 నాటౌట్, బౌల్ట్ 1/38).