
అహ్మదాబాద్: ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ పరీక్షల్లో అవకతవకలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపాయి. అధికార ప్రతిపక్ష నేతల వాదనలు, ప్రతి సవాళ్లు..సుప్రీంకోర్టు విచారణ కూడా చేపట్టింది. ఈ ఉత్కంఠ కొనసాగుతుండగానే.. ఉత్తర గుజరాత్ లోని మెహసానాలో మెడికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.
యూపీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశానికి హోమియోపతి వైద్యులు రూ. 16.32 లక్షలు చెల్లించాడు. ఒక్క క్లాసుకు కూడా హాజరు కాకుండా ఏ పరీక్షా రాయకుండా.. డబ్బులు చెల్లించి అతను డిగ్రీ, సర్టిఫికెట్లు పొందాడు. అయితే అది నకిలీ సర్టిఫికెట్ అని తెలుసుకొని 2019లో పోలీసులను ఆశ్రయించాడు.. అయితే దాదాపు ఐదేళ్ల తర్వాత జూన్ 14న మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు అయింది.
జూలై 2018లో సురేష్ పటేల్ (41) అనే హోమియోపతి డాక్టర్ మెడిసిన్ ఉన్నత విద్యకు సంబంధించి ఇంటర్నెట్ లో సెర్చింగ్ చేస్తుండగా.. ఆల్ ఇండియా అల్టర్నేటివ్ మెడికల్ కౌన్సిల్ అనే ఫోరమ్ ద్వారా MBBS డిగ్రీని అందజేస్తున్న ట్లు తెలుసుకున్నాడు. వెబ్ సైట్ చూసి డాక్టర్ ప్రేమ్ కుమార్ రాజ్ ఫుత్ కు ఫోన్ చేయగా.. ఇంటర్ చదివిన సురేష్ పటేల్ కు MBBS డిగ్రీని ఇప్పిస్తానని చెప్పాడు.అది చట్టబద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చాడు.
దీంతో పటేల్ డాక్టర్ ముందుగా రూ. 50వేలు చెల్లించాడు.. ఆ తర్వాత ఝాన్సీలోని బుందేల్ ఖండ్ యూనివర్సిటీ నుంచి అడ్మిషనల్ లెటర్ పొందాడు. డాక్టర్ సాకేత్ ఖాన్, డాక్టర్ ఆనంద్ కుమార్, అరుణ్ కుమార్ లు తనకు MBBS కోర్సు పూర్తి చేయడానికి సాయం చేస్తారని చెప్పాడు. అతని సూచనల మేరకు జూలై 10, 2018 మధ్య రూ. 16.30 లక్షలు చెల్లించాడు.
ఫీజు చెల్లించిన పటేల్ .. ఎంబీబీఎస్ క్లాసులు ప్రారంభం గురించి వేచి చూస్తుండగా.. మార్చి 2019లో కొరియర్ ద్వారా మెమోలు, డిగ్రీ సర్టిఫికెట్లు వచ్చాయి. ఇవన్నీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI) స్టాంపుతో ఉన్నాయి. MCI ని సంప్రదించిన పటేల్ షాక్ తిన్నాడు.. ఇవీ ఫేక్ సర్టిఫికెట్లు అని తాను మోసపోయానని తెలుసుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు..
అయితే ఇప్పటివరకు కూడా కేసు ఎఫ్ ఐఆర్ కాలేదు.. 2024 జూన్ 14న ఎఫ్ఐఆర్ నమోదు అయింది. దాదాపు ఐదేళ్ల తర్వాత కేసు నమోదు చేయడం పలు అనుమానాలను కలిగిస్తోంది.