నాకో హెల్మెట్ కావాలి.. ఎక్కడుందో చెప్పండి

నాకో హెల్మెట్ కావాలి.. ఎక్కడుందో చెప్పండి

ఈ మధ్య ట్రాఫిక్​ పోలీసోళ్లు హెల్మెట్​ లేకుండా బైక్​ నడుపుతున్నందుకు జాకిర్​ను పట్టుకున్నరు. కొత్త చట్టంలో ఉన్న రూల్స్​ ప్రకారం వెయ్యి రూపాయల ఫైన్​ వేసేందుకు సిద్దమైన్రు. అయితే ‘మార్కెట్​లో ఉన్న ఏ హెల్మెట్​లో కూడా నా తల పడ్తలేద’ని జాకిర్​ చెప్పిన మాట విన్న పోలీసోళ్లు అక్కడున్న కొంత మంది హెల్మెట్లు తీసుకొచ్చి జాకిర్​ తలకు పెట్టేందుకు ట్రై చేసిన్రు. ఎవరి హెల్మెట్​ కూడా పట్టలేదు. దీంతో ‘అవును.. ఆయన చెబుతున్నది కూడా నిజమే’నని ఒప్పుకున్నరు. ‘హెల్మెట్​ దొరకనప్పుడు నువ్వేం చేస్తవ్​.. పో’ అని ఫైన్​ వేయకుండనే వదిలిపెట్టిన్రు.

ట్రాఫిక్​ పోలీసోళ్లు ఒక్కసారంటే వదిలిపెట్టిన్రు. అందరు అట్ల వదిలేస్తరని లేదు కదా..? కొంతమంది ‘మాకు అనవసరం.. నువ్వు హెల్మెట్​ పెట్టుకోలేదు. జరిమానా కట్టాల్సిందే’నని చెప్తే ఏం చేయాల? ఫొటోలు తీసి ఆన్​లైన్​ల చలాన్​ పెడితే కట్టక తప్పదు కదా? అని జాకిర్​ బాధపడ్తున్నడు. తన తలకాయ పట్టే హెల్మెట్​ ఎక్కడైనా దొరుకుతదా అని కనిపించిన ప్రతి షాప్​కు వెళ్తున్నడు. ఇప్పటిదాక ఏ దుకాణంలో కూడా జాకిర్​కు హెల్మెట్​ దొరకలేదట.

‘కొత్తగా తీసుకొచ్చిన చట్టం అంటే నాకు కూడా గౌరవమే. నిబంధనలను పాటించడానికి సిద్ధమే. నా దగ్గర అన్ని పేపర్లు ఉన్నయ్​. లైసెన్స్​, ఇన్సూరెన్స్​ చూపించినా కూడా పోలీసోళ్లు హెల్మెట్​ గురించే అడుగుతున్నరు. ఆపిన ప్రతిసారి నా బాధంతా చెప్పుకోవాల్సి వస్తోంది. అయితే సూరత్​లో కస్టమ్స్​ హెల్మెట్లు తయారు చేసే దుకాణం ఉన్నదని తెలిసింది. అక్కడి నుంచి నాకు సరిపోయే హెల్మెట్​ను తెచ్చుకోవాలని అనుకుంటున్న. అప్పటిదాక బైక్​ బయటకు తీయొద్దని అనుకుంటున్న’– జాకిర్​ మామన్​