ఆస్పత్రి ఐసీయూలో దమ్ము కొట్టాడు.. ఆ తర్వాత

ఆస్పత్రి ఐసీయూలో దమ్ము కొట్టాడు.. ఆ తర్వాత

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేరిన ఓ రోగి బీడీ వెలిగించడంతో ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఆక్సిజన్ సపోర్టులో ఉన్న ఆ వ్యక్తి చేసిన ఈ పనితో ఘోరమైన పరిణామాలను ఎదుర్కోవల్సి వచ్చింది. అది చివరికి హెల్త్‌కేర్‌లో అగ్ని ప్రమాదానికి దారితీసింది. ఈ ఘటనలో బీడీ వెలిగించిన రోగి ఆక్సిజన్ మాస్క్ కు మంటలు అంటుకోవడంతో అతనికి గాయాలయ్యాయి.

ధూమపానానికి బానిసైన ఆ రోగి దీర్ఘకాలిక అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)తో బాధపడుతున్నాడని, దానికే చికిత్స పొందుతున్నాడని సమాచారం. రోగి మంచం దగ్గర సగం కాలిపోయిన అగ్గిపుల్ల, అగ్గిపెట్టె కనిపించింది. ఈ క్రమంలోనే ఆసుపత్రి నుంచి వచ్చిన విజువల్స్ ఆ వార్డు స్వల్పంగా దెబ్బతిన్నట్లు చూపించాయి.                           

ఘటన అనంతరం వెంటనే స్పందించి.. చిన్న పాటి మంటలు వ్యాపించకుండా ఆస్పత్రి సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. నిమిషాల వ్యవధిలోనే మంటలను ఆర్పివేశారు. ధూమపానానికి అలవాటు పడిన అతని అవసరాన్ని తీర్చేందుకు ప్రయత్నించి ఆస్పత్రి యాజమాన్యం భద్రతా నియమాలను ఉల్లంఘించడంపై పలువురు మండిపడుతున్నారు.