
న్యూఢిల్లీ: టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్18వ సీజన్‌లో మరో భారీ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్తు అందుకుంది. ఓపెనర్ సాయి సుదర్శన్ (61 బాల్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 108 నాటౌట్) సెంచరీకి తోడు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (53 బాల్స్‌లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 93 నాటౌట్) ఖతర్నాక్ బ్యాటింగ్‌తో దంచికొట్టడంతో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో జీటీ 10 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. తొమ్మిదో విజయం, 18 పాయింట్లతో టాప్ ప్లేస్ చేరుకున్న జీటీ తనతో పాటు ఆర్సీబీ, పంజాబ్ ప్లేఆఫ్స్ బెర్తులు ఖాయం చేసింది.
ఇంకోవైపు ఓపెనర్ కేఎల్ రాహుల్ (65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 112 నాటౌట్) అజేయసెంచరీ చేసినా భారీ స్కోరును కాపాడుకోలేకపోయిన డీసీ ఐదో ఓటమితో రేసులో వెనుకబడింది. ఏకపక్ష పోరులో తొలుత డీసీ 20 ఓవర్లలో 199/3 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో ఓపెనర్ల జోరుతో జీటీ 19 ఓవర్లోనే 205/0 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. సుదర్శన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
రాహుల్ సెంచరీ జోరు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ స్టార్టింగ్‌లో ఇబ్బంది పడింది. జీటీ పేయర్లు సిరాజ్, అర్షద్ ఖాన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తొలి నాలుగు ఓవర్లలో 15 డాట్ బాల్స్ వేయడంతో ఐదు ఓవర్లకు డీసీ 28/1 స్కోరు మాత్రమే చేసింది. ఓపెనర్ డుప్లెసిస్ (5) అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కానీ, రబాడ వేసిన ఆరో ఓవర్లో రాహుల్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో జోరందుకున్నాడు. ఫీల్డింగ్ మారిన తర్వాత అభిషేక్ పోరెల్ (30) తోడుగా మంచి షాట్లతో అలరించిన కేఎల్ 35 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. సగం ఓవర్లకు డీసీ 81/1తో నిలిచింది.
భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించిన పోరెల్.. స్పిన్నర్ సాయి కిషోర్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో రెండో వికెట్‌కు 90 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. కిశోర్ బౌలింగ్‌లో కేఎల్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టగా.. కెప్టెన్ అక్షర్ పటేల్ (25) కూడా అతడినే టార్గెట్ చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అక్షర్ ఔటైనా.. కేఎల్ అదే జోరు కొనసాగిస్తూ 60 బాల్స్‌లో సెంచరీ అందుకున్నాడు. చివర్లో స్టబ్స్ (21 నాటౌట్) తోడుగా 22 బాల్స్‌లోనే 48 రన్స్ జోడించి జట్టుకు భారీ స్కోరు అందించాడు.
ఓపెనర్లే కొట్టేశారు
ఓపెనర్లు సుదర్శన్, గిల్ అద్భుతంగా ఆడటంతో జీటీ సులువుగా గెలిచింది. పవర్ ప్లేలో సుదర్శన్ ఖతర్నాక్ షాట్లు కొట్టాడు. నటరాజన్ వేసిన రెండో ఓవర్లో మూడు ఫోర్లు, సిక్స్ బాదిన అతను అక్షర్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు రాబట్టాడు. మరో ఎండ్‌లో గిల్ జాగ్రత్తగా ఆడగా.. తర్వాతి నాలుగు ఓవర్లలో ఒకే ఫోర్ ఇచ్చిన డీసీ బౌలర్లు ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు.
ఈ టైమ్‌లో అక్షర్ బౌలింగ్‌లో ఫోర్‌తో సుదర్శన్ ఫిఫ్టీ అందుకోగా.. గిల్ ఒక్కసారిగా గేరు మార్చాడు. అక్షర్, కుల్దీప్, విప్రజ్ ఓవర్లలో మూడు సిక్సర్లు కొట్టి స్కోరు వంద దాటించాడు. చమీర బౌలింగ్‌లో 4, 6తో ఫిఫ్టీ అందుకోగా.. సుదర్శన్ కూడా ఫోర్లు, సిక్సర్లతో వేగం పెంచాడు. నట్టూ బౌలింగ్‌లో ఫోర్‌తో 90ల్లోకి వచ్చిన యంగ్‌స్టర్ కుల్దీప్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆపై విప్రజ్ ఓవర్లో సిక్స్‌తో మ్యాచ్ ముగించాడు.
సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ: 20 ఓవర్లలో 199/3 (రాహుల్ 112 నాటౌట్, అర్షద్ ఖాన్ 1/7)
గుజరాత్: 19 ఓవర్లలో 205/0 (సుదర్శన్ 108 నాటౌట్, గిల్ 93 నాటౌట్, ముస్తాఫిజుర్ 0/24).
1 ఐపీఎల్ రాహుల్‌కు ఐదో సెంచరీ. దాంతో మెగా లీగ్‌లో మూడు జట్ల (పంజాబ్ కింగ్స్, లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్) తరపున సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అలాగే, టీ20ల్లో 8 వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు.